తెలంగాణలో సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ద్రవ్యోల్బణం దాదాపు 400శాతం పెరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు రూ.370 కోట్ల మిగులు బడ్జెట్ ఉంటే ఇప్పుడు రూ.7లక్షల కోట్ల పై చిలుకు అప్పుల ఊబిలో కూరుకుపోయిందని పేర్కొంటున్నారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టులు కడుతున్నారని పేర్కొంటున్నారు. దీనికి కౌంటర్ గా కేంద్రం కూడా అప్పులు చేస్తోందని అభివృద్ది చేయాలంటే అప్పులు చేయాలని బీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని కాంగ్రెస్ నేతలు సైతం ఆరోపిస్తున్నారు. దీనిపై ఆర్థిక నిపుణులు స్పందిస్తూ.. అప్పు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని.. కాకపోతే అప్పు దేనికోసం చేస్తున్నారో అనే అంశంపై చర్చ జరగాలని కోరుతున్నారు. ప్రజల ఆర్థిక అవసరాల కోసం.. ఆర్థికంగా ఆదాయం ఇచ్చే వనరులపై ఖర్చు పెడుతున్నారా.. లేక అనవసర అంశాల గురించి వృథా చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుత రాజకీయాల్లో ఈ తరహా చర్చలేవి జరగడం లేదు. అప్పులు చేయడం వల్ల ఉపయోగం ఏంటి అనే అంశంపై వాదోపవాదనలు జరగాలి. అప్పు వల్ల ఉత్పాదక వ్యయం తెస్తావా.. లేక అను ఉత్పాదక వ్యయం చేస్తావా అనేదే ప్రశ్న. ఇదే నియమం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇండియా దేనికైనా వర్తిస్తుంది. మరోవైపు ఎలాంటి రుణాలు తీసుకొస్తున్నాం అనేది కూడా ముఖ్యమే. భారీ వడ్డీతో అప్పులు చేయడం కూడా ఆర్థిక మందగమనానికి దారి తీస్తుంది. కాబట్టి ఆయా ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని ఆయా రాష్ట్రాలు అప్పులు చేసి వాటిని తీరుస్తుంటే ఎటువంటి సమస్యలు ఉండవు.