ఏపీ సీఎం జగన్ బీసీ మంత్రం  పఠిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు బీసీలను టార్గెట్ చేసుకున్న జగన్ ఈ సారి వారిని ఓన్ చేసుకోవాలని చూస్తున్నారు.  ఇందుకు తమ సామాజిక వర్గాన్ని పణంగా పెడుతున్నారు. రెడ్డి సామాజిక వర్గ  నాయకుల్ని బుజ్జగించి పక్కన పెడుతున్నారు. వారి స్థానంలో బీసీలను పోటీ చేయించేందుకు ప్రత్యేక వ్యూహం రూపొందింస్తున్నారు.


ఎక్కడికక్కడ స్థానిక  పరిస్థితులకు అనుగుణంగా వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకుల్ని ఎన్నికల్లో పోటీ చేయించేందుకు కసరత్తులు మొదలు పెట్టారు. దీంతో బీసీ పార్టీగా ముద్ర పడిన టీడీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.  ఇది పక్కన పెడితే  రెడ్డి సామాజిక వర్గానికి దిష్టి తగిలినట్లుంది.  తెలంగాణ, ఆంధ్రా రెండు రాష్ట్రాలను కలిపితే మొత్తం 93 వరకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు.  రెండు తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి రాజ్యం నడుస్తోంది అనే పోస్టులు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గ నేతలే గెలిచారు.  ఏపీలో కూడా పార్టీలు ఏదైనా సరే ఇదే జరుగుతుంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే జగన్ అనూహ్యంగా తమ సామాజిక వర్గ నేతలకే షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నేతలను పార్లమెంట్, ఎమ్మెల్సీ  లేదా ఇతర నామినేటడ్ పోస్టులకు ఎంపిక చేస్తారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.


అయితే వీరంతా తమ అధినేత మాట విని ఆయన వెంటే నడుస్తారా లేక పార్టీ మారుతారా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ పార్టీ మారదాం అనుకుంటే వారికి తెలంగాణలో మాదిరిగా ఏపీలో ప్రత్యామ్నాయం లేదు.  టీడీపీ వైపు చూసినా.. వారికి అక్కడ కొంత ఇబ్బందికర  పరిస్థితులు ఎదురవుతాయి. మరోవైపు రాయలసీమలో టీడీపీ చాలా బలహీనంగా ఉంది. జగన్ తన పై రెడ్డి ముద్ర ప్రభావం లేకుండా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రెడ్డి సామాజిక వర్గ నేతలంతా జనసేన, టీడీపీ వైపు  చూస్తే ఆ కూటమి పుంజుకునే అవకాశం ఉంటుంది. మరి అప్పుడు జగన్ ఎలా తట్టుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: