తెలుగు రాష్ట్రాల మధ్య జల యుద్ధం మొదలైంది. ఈ వివాదాన్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తెస్తోంది. ఏపీలోని జగన్ సర్కారు కు మేలు చేసేలా కేసీఆర్ నాడు నిర్ణయాలు తీసుకున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగిందో వివరిస్తూ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తున్నారు. కృష్ణా నది నిర్వాహణ కేంద్రానికి అప్పగించే ప్రసక్తే లేదని తీర్మానం చేసి బిల్లును ఆమోదించారు.


అయితే ఇప్పుడు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశం అయింది. రైట్ మెన్ ఇన్ రాంగ్ పార్టీ.. రైట్ మీటింగ్ ఇన్ రాంగ్ టైం అనే పదాలు వైఎస్ షర్మిళకు సరిపోతాయి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఆమె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు. ప్రస్తుతం ఏపీలో ఆపార్టీ జవ సత్వాలు కోల్పోయి పదేళ్లు అవుతోంది. కాబట్టి రైట్ మెన్ ఇన్ రాంగ్ పార్టీ అని అంచనా వేస్తున్నారు.


మరోవైపు ఆమె తెలంగాణలో పెట్టిన వైఎస్సార్ టీపీ విలీనం తెలంగాణలో జరగలేదు.  ఎన్నికల సమయంలోను.. ఆ తర్వాత కూడా రేవంత్ రెడ్డి పై షర్మిళ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎం కావడం ఆమెకు ఇష్టం లేదు. కానీ అధిష్ఠానం అనూహ్యంగా సీఎంగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసింది. దీంతో ఆయనతో విభేదాలు ఎందుకు అనుకుందో ఏమో  తాజాగా రేవంత్ రెడ్డి దంపతులను కలిశారు.


అయితే సీఎం రేవంత్ రెడ్డి జగన్ తెలంగాణ జలాలను దోచుకుపోతున్నారని అసెంబ్లీలో విమర్శించారు. షర్మిళ కూడా ఏపీలో దూకుడు కనబరుస్తున్నారు. విభజన హామీలను తీసుకురావడంతో జగన్ విఫలం అయ్యారని.. తద్వారా ఏపీకి అన్యాయం చేస్తున్నారని తూర్పారపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని వెళ్లి షర్మిళ కలవడం రాంగ్ మీటింగ్ ఇన్ రాంగ్ టైం అని విశ్లేషిస్తున్నారు. సమావేశం వ్యక్తిగతమా.. లేక పార్టీ బలోపేతమా అనేది పక్కన పెడితే సమయం మాత్రం సరైంది కాదు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: