ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో కేవలం 1.5శాతం ఓట్లతో అధికారం కోల్పోవడం.. వైసీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు టీడీపీలో చేర్పించుకొని.. వాళ్ల చేతే జగన్ ను తిట్టించడం వంటివి చేశారు. ఇవి వైసీపీ కార్యకర్తల్లో ఆగ్రహానికి కారణం అయ్యాయి. జగన్ ని ఒంటరి చేస్తున్నారు అనే భావన వారిలో కలిగింది. దీంతో ఈ సారి జగన్ ను ఎలాగైనా సీఎం చేయాలని భావించి.. పార్టీ అధినేతక దీటుగా వీళ్లు క్షేత్రస్థాయిలో పనిచేశారు. ఫలితం 2019 ఎన్నికల్లో 151 సీట్లలో అఖండ విజయం.
అదే ఉత్సాహంతో ఈ సారి కూడా సీఎం జగన్ వై నాట్ 175 అని పిలుపునిచ్చారు. కానీ కార్యకర్తల్లో అప్పటి కృషి, పట్టుదల కనిపించడం లేదు. సిద్ధం సభల నిర్వహణ తర్వాత ఒక అరవై శాతం మందిలో ఈ కసి కనిపిస్తోంది తప్ప.. మిగతా వారిలో ఆ భావన కనిపించడం లేదు. పార్టీపై ప్రేమ లేదా అంటే ఉంది.
కాకపోతే పార్టీ గెలుస్తుందనే ధీమా వారిలో నెలకొంది. దీంతో పాటు అతిగా ఆశించడం. పార్టీ కోసం పనిచేసినా నాకు పదవి రాలేదు అని కొందరు ఫీల్ అయితే... వచ్చిన వారు ఇంత చిన్న పదవి దక్కిందని నిరుత్సాహంగా ఉన్నారు. మరోవైపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు మాత్రం ఈ సారి ఎలాగైనా జగన్ ను గద్దె దించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. మరి వైసీపీ శ్రేణుల చూస్తూ ఊరుకుంటారా.. అధికారాన్ని అప్పజెబుతారా అనేది చూడాలి.