రాజకీయాల్లో నైతిక విలువలు, సిద్ధాంతాలు ఎప్పుడో మరుగున పడ్డాయి. అప్పటి వరకు ఓ పార్టీలో ఉండి.. ప్రత్యర్థిని విమర్శించిన వారే.. తిరిగి అదే పార్టీలోకి చేరుతున్నారు. దీంతో ప్రజలు ఎవరు  ఏ పార్టీయో.. ఏ సిద్ధాంతాలపై పనిచేస్తున్నారో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. గతంలో బీజేపీ అంటే ఒక సిద్ధాంత పర, క్రమశిక్షణ కలిగిన పార్టీగా పేరుండేది. ఒక్క ఎంపీ స్థానం కోసం వాజ్ పేయీ రాజీనామా చేసిన విషయం మనందరకీ తెలిసిందే..


కానీ నేడు అదే పార్టీ ఆ సిద్ధాంతాలకు తిలోదకాలు వదిలింది. జాతీయ స్థాయిలో అవినీతిని అంతం చేస్తాం.. అక్రమార్కులను జైలుకు పంపిస్తాం అంటూ బీరాలు పలుకుతున్నా.. తమ పార్టీలోకి చేరగానే ఇవన్నీ మరుగున పడుతున్నాయి. ఒక్కసారిగా అవినీతి పరులంగా.. నీతివంతులగా మారిపోతున్నారు. గతంలో కాంగ్రెస్ లోనే ఈ తరహా పోకడ ఉంటే.. ఇప్పుడు ఆ పరిస్థితి బీజేపీలో కనిపిస్తోంది.


ఇటీవల ఏపీలో బీజేపీ ఆరు ఎంపీ సీట్లకు లోక్ సభ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో మొదటి నుంచి పార్టీలో పనిచేసిన వారికి కాకుండా పారాచ్యూట్ నేతలకు టికెట్లు కేటాయించింది. అరకు ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేశ్, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, నరసాపురం నుంచి శ్రీనివాస శర్మ, తిరుపతి నుంచి వరప్రసాద రావు, రాజంపేట నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేర్లను బీజేపీ ప్రకటించింది.


అయితే జాబితాలో మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న జీవీఎల్, పీవీఎన్ మాధవ్, సోము వీర్రాజు, విష్ణువర్దన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు టికెట్లు ఆశించినా వారికి నిరాశే ఎదురైంది. వీరికి టికెట్లు రాకుండా టీడీపీ ప్రో నేతలు అడ్డుకున్నారని తెలుస్తోంది. ఎన్డీయేలో టీడీపీ చేరేందుకు ఐదేళ్లుగా యత్నిస్తుండగా వీరంతా అడ్డుకున్నారు. చివరకు పొత్తు కుదిరింది. దీంతో వీరికి మొండి చేయి ఎదురైంది. మొత్తంగా చూసుకుంటే రాజకీయాల్లో విలువలు పక్కన పెట్టేశారు. పన్నుల ఎగవేత, బ్యాంకులకు ఎగనామం పెట్టేవారికి సీట్లు ఇస్తున్నారు. దీనికి బీజేపీ అతీతం కాదని నిరూపించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: