ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయం వేడెక్కింది. ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విచిత్రమైన పరిస్థితి నెలకొంది. రాజమండ్రి నుంచి కూటమి అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బరిలో దిగిన సంగతి తెలిసిందే. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఈ ప్రాంతంలో ఉన్న బలం రీత్యా వాస్తవానికి రాజమండ్రి అన్నది చాలా సురక్షితమైన సీటు కిందే చెప్పుకోవాలి. టీడీపీకి ఉన్న క్షేత్ర స్థాయి బలంతో పాటు.. జనసేనకు ఉన్న కాపు ఓట్ల బలం కూడా ఇక్కడ గణనీయంగానే ఉంటుంది.


అయితే తాజా పరిస్థితి చూస్తే పురందేశ్వరికి గెలుపు అంత సులభంగా కనిపంచట్లేదు. ఇందుకు కారణం కూటమిలో భాగస్వామి అయిన బీజేపీ చేసిన పొరపాట్లు లేదా.. తప్పుడు నిర్ణయాలు కూటమి అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బ తీస్తున్నాయన్న అభిప్రాయం కూటమి నేతల్లోనే కనిపిస్తోంది. ప్రత్యేకించి నరసాపురం సీటును అందరూ ఉహించినట్టు రఘురామ కృష్ణంరాజుకు కాకుండా వేరే వ్యక్తికి ఇవ్వడం కూటమి నేతలకు షాక్ అనే చెప్పాలి.


రఘురామ కృష్ణంరాజుకు టికెట్‌ ఇస్తే.. తన ఎంపీ పరిధిలోని అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ఖర్చు కూడా పెట్టుకుని గెలిపించుకోగల ఆర్థిక స్థోమత ఉన్న వ్యక్తి ఆయన. కానీ బీజేపీ మాత్రం ఆయనకు మొండిచెయ్యి చూపించింది. మరోవైపు అనపర్తిలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ సీటు పొత్తులో బీజేపీకి దక్కింది. కానీ బీజేపీ కూడా ఎలాంటి ప్రముఖుడికి టికెట్‌ ఇవ్వకుండా ఓ అనామకుడికి టికెట్‌ ఇచ్చిందన్న వాదన వినిపిస్తోంది.


మరి బీజేపీ కావాలనే ఇలాంటి తప్పులు చేసి.. వైసీపీకి మేలు చేస్తోందా అన్న అనుమానాలు కూడా టీడీపీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వైసీపీ కూడా కొన్ని స్థానాల్లో అనామకులను బరిలో దింపడం కూడా బీజేపీతో ఉన్న అవగాహన మేరకే అన్న వాదన కూడా కొందరు టీడీపీ నేతలు వినిపిస్తున్నారు. మొత్తానికి ఇలా కూటమి కుంపట్ల కారణంగా  అసలు బీజేపీ మిత్రపక్షం టీడీపీనా..  వైసీపీనా.. అని కొందరు టీడీపీ నేతలు వెటకారం ఆడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: