ఏపీలో అధికార మార్పిడే లక్ష్యంగా, వ్యతిరేక ఓటు చీలొద్దనే ఉద్దేశంతో టీడీపీ, జనసేన ముందుగా పొత్తు పెట్టుకున్నాయి.  ఆ తర్వాత తమ కూటమిలోకి బీజేపీని తీసుకువచ్చేందుకు  అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ లు తీవ్ర ప్రయత్నం చేసి చివరకి విజయవంతం అయ్యారు. ఇక 2014 ఎన్నికల సమయంలో జరిగిన ఫలితాలే పునరావృతం అవుతాయని మూడు పార్టీల నాయకులు భావిస్తున్నారు.


అయితే ఈ కూటమి విజయవంతం అవుతుందా.. లేదా.. కూటమి ఎదుర్కొనే సవాళ్లను మనం పరిశీలిస్తే.. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ఎప్పటి నుంచో ప్రజలు, ఆయా పార్టీల కార్యకర్తలు భావించారు. కానీ బీజేపీ విషయానికి వచ్చే సరికి చివరి నిమిషం వరకు స్పష్టత లేదు. పొత్తు పెట్టుకునే వరకు కూడా ఇరు పార్టీల నాయకులు సోషల్ మీడియా వేదికగా తిట్టుకున్నారు. అందుకు అనుగుణంగా ఆయా పార్టీల సోషల్ మీడియా విభాగాలు పనిచేశాయి. దీంతో ఈ మూడు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో సానుకూల వాతావరణం కనిపించడం లేదు.


క్షేత్రస్థాయిలో తమ పార్టీల నాయకులను కలుపుకొని పోవడం లేదని కూటమిలోని మిగతా పార్టీల నాయకులు ఆరోపిస్తూ వస్తున్నారు.  మరోవైపు  ఈ పొత్తు ఎందుకు అవసరం అనే విషయాన్ని కూటమి నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు. పొత్తులకు ప్రజలు కన్విన్స్ అయితే ప్రజలు ఓటేస్తారు. 2009లో కూటమి వైఫల్యం చెందని విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.


ప్రజలు ఈ పొత్తును కోరుకుంటే.. కూటమిని ఆదరిస్తారు. ఎలా అంటే అధికార పార్టీని దించేయాలి అనే భావన ఓటర్లలో ఏర్పడితే ఇది సక్సెస్ అవుతుంది.  కూటమిపై ఆయా పార్టీల నాయకులతో పాటు కార్యకర్తల్లో నమ్మకం ఉండాలి. అది ప్రజల్లో కలిగించాలి. కూటమి అధికారంలోకి వస్తుంది అనే సానుకూల పవనాలు తటస్థ ఓటర్లను ప్రభావితం చేస్తాయి.  పొత్తు పట్ల చంద్రబాబు ఇంకా వివరణ ఇచ్చుకుంటూనే ఉన్నారు. మేం కలవలేదు. బీజేపీనే వచ్చింది అంటూ మైనార్టీలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఇది బీజేపీ నాయకులకు ఆగ్రహం తెప్పించేవే. మరి ఈ సవాళ్లను అధిగమించి కూటమి అధికారంలోకి వస్తుందా రాదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: