నిత్యం జనం మధ్యే మాస్‌ లీడర్లు..
ఓడినా గెలిచినా తగ్గని మాస్‌ క్రేజ్‌..
నిత్యం వార్తల్లో నిలిపే మాస్‌ తత్వం..

మాస్.. మమ మాస్.. అన్న నడిచొస్తే మాస్.. అన్న నుంచుంటే మాస్.. అన్న లుక్కిస్తే మాస్ మ మ మాస్.. అన్న పాంటేస్తే మాస్‌.. అన్న షర్టేస్తే మాస్‌.. మ మ మాస్.. అంటూ ఓ సినిమా మాట ఉంది. ఆ పాట చూసి అప్పట్లో జనం పిచ్చెక్కిపోయారు. మాస్.. మాస్.. మాస్.. అసలు ఈ మాస్‌ అంటే ఏంటి.. మాస్ అంటే జనం.. జనం మెచ్చిందే మాస్.. జనం నచ్చిందే మాస్‌..  అందుకే సినిమా అయినా.. పొలిటికల్‌ లీడర్‌ అయినా సరే.. మాస్‌గా ఉంటే సూపర్‌ హిట్టే..


కాలంతో పాటు రాజకీయం మారుతోంది. రాజకీయ నేతలూ మారుతున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులంతా మాస్‌ మంత్రం పఠిస్తున్నారు. నిత్యం జనంలో నానాలి.. అలా నానిన వాడే మాస్‌ లీడర్‌. అది మంచయినా చెడయినా.. నిత్యం ప్రజల్లో ఉండాలి.. ప్రజలు మన గురించి చెప్పుకోవాలి.. ఇందులో సక్సస్‌ అయిన వాళ్లే సక్సస్‌ఫుల్ లీడర్లు అవుతున్నారు.


తెలుగు నాయకుల్లో ఇలా మాస్‌గా గుర్తింపు తెచ్చుకున్నవారిలో పాతతరం నాయకులను వదిలేస్తే ఎన్టీఆర్‌ మాస్‌ లీడర్‌గా బాగా గుర్తింపు పొందారు. ఆయన సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ మాస్‌ లీడర్‌గా జనంతో శభాష్‌ అనిపించుకున్నారు. ఎన్టీఆర్‌ కాలంలో ఆయన ఏం చేసినా ఓ సంచలనమే. సీఎంగా ఉండి కూడా నడిరోడ్డుపై భైటాయించి ధర్నా చేయడం ఆయనకే చెల్లింది. ఇక ఎన్నికల సమయంలో ఆయన ప్రచారానికి వెళ్లే జనం పోటెత్తేవారు. ఆయన మైకు పట్టి నా ఆరుకోట్ల ఆంధ్రులకు అంటూ ప్రసంగం మొదలు పెడితే జనం ఊగిపోయేవారు.


ఇక ఎన్టీఆర్‌ తర్వాత ఆ స్థాయిలో జనంలో మాస్‌ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నది వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిగా చెప్పుకోవచ్చు. సహజంగానే మాస్‌ లీడర్‌ అయిన వైఎస్ఆర్‌.. పాదయాత్ర ద్వారా జననేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. పాదయాత్రలో ఆయన ప్రజలను పలకరించిన తీరు.. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్న తీరు.. ప్రజలకు మరింత చేరువ చేసింది. ఆయన మైక్‌ పట్టి అమ్మా.. చెల్లెమ్మ.. బాబాయి.. అంటూ ఆత్మీయంగా మాట్లాడేవారు.


చంద్రబాబు విషయానికి వస్తే.. ఆయనదో రకం మాస్‌.. ఆకట్టుకునేలా ప్రసంగాలు చేయలేకపోయినా.. ఆయన్ని పిచ్చిగా అభిమానించేవారు లక్షల్లో ఉంటారు. ఏం తమ్ముళ్లూ అంటూ ఆయన పలకరిస్తే పొంగిపోతుంటారు. అందుకే ఆయన పర్యటనలకు కూడా జనం వేల సంఖ్యలో హాజరవుతారు. చంద్రబాబు జనంలోకి వెళ్తే నాటకీయత కనిపించకపోయినా అభిమానులు మాత్రం పోటెత్తుతారు.  
 

ఇక వైఎస్‌ఆర్‌ బాటలోనే ఆయన కుమారుడు జగన్‌ కూడా మాస్‌ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. జగన్‌ను మాస్‌ లీడర్‌ను చేసింది కూడా పాదయాత్రే. పాదయాత్ర సమయంలో ఆయన జనంతో పూర్తిగా మమేకమయ్యేవారు. తమ సొంత ఇంటి మనిషి అని జనం ఫీలయ్యేలా జగన్‌ ప్రవర్తన ఉంటుంది. ప్రజల చేతుల్లో చేతులు వేసి మాట్లాడటం.. ఆప్యాయంగా తలపై ముద్దు పెట్టడం వంటి చర్యలతో జగన్ మావాడు అని జనం భావించేవారు.

 
తెలంగాణ విషయానికి వస్తే.. కేసీఆర్‌ ను మించిన మాస్‌ లీడర్‌ కనిపించరు. బక్కపలచని రూపం అయినా ఆకట్టుకునే ప్రసంగాలతో ఆయన మాస్‌ లీడర్‌గా ఎదిగారు. పక్కా తెలంగాణ యాసతో.. స్థానిక సామెతలతో ఆయన చేసే ప్రసంగాలు ప్రజలను వెర్రెక్కించేవి. మాటలతోనే అగ్ని రాజేయగల వాగ్ధాటి ఆయన సొంతం. ఆయన తర్వాత ఆ స్థాయిలో మాస్‌ లీడర్‌గా హరీశ్‌రావు ఎదిగారు. నాయకుడంటే నిత్యం జనం మధ్య ఉండేవాడని హరీశ్‌రావు నిరూపించారు. అందుకే ఆయన సిద్ధిపేటలో ఎప్పుడూ అత్యధిక మెజారిటీతో గెలుస్తుంటారు. గ్రామస్థాయి నేతలను కూడా గుర్తుపట్టి మాట్లాడగలగటం హరీశ్‌రావు  ప్రత్యేకత. ఇలాంటి గుర్తింపే కదా స్థానిక నాయకులు కోరుకునేది.


అచ్చం కేసీఆర్‌ బాటలోనే.. కేసీఆర్‌ భాషలోనే సాగుతున్న మరో మాస్‌ లీడర్‌ రేవంత్ రెడ్డి. ప్రజానాయకుడంటే ఏమాత్రం జంకు గొంకు లేకుండా ముందుకు సాగాలన్నది రేవంత్ రెడ్డి తత్వం. అందుకే కొండలైనా ఢీకొనేందుకు సిద్ధం అన్నట్టుగా రాజకీయాల్లో దూసుకుపోతుంటారు. ఇక రేవంత్‌ రెడ్డి జనంలోకి వెళ్తే పూనకాలే. ప్రజల బాగోగులు తెలుసుకోవడం.. వారి సమస్యలకు పరిష్కారాలు చూపడంలో ఆయన ముందుంటారు. అందుకే ఓడినా గెలిచినా కొడంగల్‌ ముద్దుబిడ్డగా రేవంత్‌ రెడ్డి గుర్తింపు పొందారు.


తెలంగాణలోని జగ్గారెడ్డి మాస్‌కు మరో ప్రతిరూపం. ఓడినా గెలిచినా జనంలో ఉండే నేత జగ్గారెడ్డి.
కోమటిరెడ్డి సోదరులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఆంధ్రాకు వస్తే చింతమనేని ప్రభాకర్‌, కొడాలి నాని, బాలయ్య.. ఇలా జనం మెచ్చిన మాస్‌ లీడర్లు చాలామందే ఉన్నారు. అందరి మంత్రం ఒక్కటే.. అదే.. మ.. మ.. మాస్..

మరింత సమాచారం తెలుసుకోండి: