
సాధారణంగా ఓ నేత ఎన్నికల ముందు పార్టీ మారుతున్నాడంటే.. అందుకు ప్రధాన కారణం తాను ఉన్న పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోవడమే ఉంటుంది. ఒక్కోసారి తన పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనుకుంటే.. సొంత పార్టీలో టికెట్ వచ్చే ఛాన్స్ ఉన్నా.. కాదనుకుని పార్టీ మారి.. అక్కడ టికెట్ తెచ్చుకుంటారు. ఇది కూడా రొటీనే. ఇలా పార్టీ మారిన నేతలపై ఎన్నో విమర్శలు వస్తుంటాయి. రాజకీయ స్వార్థపరుడు అన్న ముద్ర ఉంటుంది. పార్టీ మీకు ఎంతో చేస్తే.. స్వార్థం కోసం పార్టీ వదిలివెళ్లిపోతారా అని తిడతారు. ఇదీ రొటీనే.
కానీ ఈ ఎన్నికల్లోనే వచ్చిన ఓ ప్రత్యేక మార్పు ఏంటో తెలుసా.. స్వయంగా పార్టీలే ఫిరాయింపులను ప్రోత్సహించడం. ఈ పొలిటికల్ ట్రెండ్ మాత్రం నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా కనిపిస్తోంది. స్వయంగా పార్టీ నేతలే.. పర్లేదులో.. నువ్వు ఆ పార్టీలోకి వెళ్లు.. ఆ పార్టీ తరపున పోటీ చేయి.. ఏం పర్లేదులే.. అని ప్రోత్సహిస్తున్నాయి. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. అసలు రాజకీయాల్లో ఇలాంటి ఓ పరిస్థితి వస్తుందని నాయకులు కూడా ఊహించి ఉండరేమో.
ఇందుకు ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అసలు జనసేన తరపున పోటీ చేసిన నాయకుల్లో సగం మంది టీడీపీ, వైసీపీ నుంచి వచ్చిన వారే. వైసీపీ నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వడంలో ఓ అర్థం ఉంది. ప్రత్యర్థి పార్టీ కాబట్టి ఇచ్చారనుకోవచ్చు. కానీ.. చివరకు కూటమిలోని పార్టీ నుంచి అభ్యర్థులను తన పార్టీలో చేర్చుకుని టికెట్లు ఇచ్చిన ఘనత జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేరుపై చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పుకోవచ్చు.
ఇలా టీడీపీ నుంచి వచ్చి జనసేన టికెట్లు దక్కించుకున్న వారి జాబితా చాలా పెద్దగానే ఉంది. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ స్వయంగా ఓడిపోయిన భీమవరంలో ఈసారి కూడా ఆ పార్టీకి సరైన అభ్యర్థి దొరికలేదు. అందుకే గత ఎన్నికల్లో భీమవరంలోనే తనతో పాటే ఓడిపోయిన టీడీపీ నేత పులవర్తి అంజిబాబును జనసేనలో చేర్చుకుని ఆయనకు టికెట్ ఇచ్చాడు పవన్ కల్యాణ్. పాలకొండలో టీడీపీ ఇన్‌ఛార్జ్ నిమ్మక జయకృష్ణను జనసేనలో చేర్చుకుని పవన్ కల్యాణ్ టికెట్ ఇచ్చారు. అలాగే అవనిగడ్డలోనూ టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్ ను పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చారు.
సొంతంగా స్థానిక నాయకత్వాన్ని తయారు చేసుకోలేని పవన్ కల్యాణ్ ఒక్క టీడీపీ నుంచే కాదు.. వైసీపీ నుంచి కూడా అభ్యర్థులను దిగుమతి చేసుకున్నారు. వైసీపీ నుంచి వచ్చిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరిని పార్టీలో చేర్చుకుని మళ్లీ మచిలీపట్నం నుంచే బరిలో దింపుతున్నారు. అలాగే విశాఖ సౌత్‌లో వైసీపీ నేత వంశీకృష్ణ యాదవ్ ను పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చారు. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు జగన్ టికెట్ ఇవ్వనుపొమ్మంటే.. అదే అవకాశంగా తీసుకుని ఆయన్ను పార్టీలో చేర్చుకుని తిరుపతి టికెట్ ఇచ్చారు.
ఇక టీడీపీ కూడా తన వంతు జంపింగ్ రాజకీయాలను ప్రోత్సహించింది. వైసీపీ ఎంపీలైన మాగుంట శ్రీనివాసులురెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను టీడీపీలో చేర్చుకుంది. వారికి మళ్లీ ఎంపీలుగా టికెట్లు ఇచ్చింది. అంతే కాదు.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి బోనస్‌గా ఆయన భార్య ప్రశాంతికి రెడ్డికి కూడా కోవూరు టికెట్ ఇచ్చారు చంద్రబాబు.
ఇక జగమెరిగిన జగన్ శత్రువుగా పేరున్న వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజును టీడీపీలో చేర్చుకుని ఆయన్ను ఉండి నుంచి ఎమ్మెల్యేగా బరిలో దింపారు చంద్రబాబు. ఇలా కూటమి పార్టీల నుంచి అభ్యర్థులను దిగుమతి చేసుకోవడంలో చివరకు బీజేపీ కూడా పాలుపంచుకుంది. అనపర్తిలో టీడీపీ ఇంచార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని తన పార్టీలో చేర్చుకుని అనపర్తి టికెట్ ఇచ్చి పోటీలో నిలుపుతోంది.