ఆరు నెలల క్రితం మొదలు పెట్టిన ఈ యుద్దం ఇంకా ఆగలేదు. సుమారు 40 వేల మంది పాలస్తీనా ప్రజలు మరణించారు. అయితే ఇజ్రాయెల్ కు అమెరికా అన్ని రకాల సహకారాలు అందిస్తోందని ఆరోపిస్తూ అమెరికాలోని పలు విద్యాసంస్థల్లో పాలస్తీనా అనుకూల విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్ కు అమెరికా ఆర్థిక, సైనిక సహకారాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ దేశంతో సంబంధాలు తెంచుకోవాలని కోరుతున్నారు.
ఐవీ లీగ్ కొలంబియా యూనివర్శిటీలో గత వారం మొదలైన నిరసనలు అమెరికా అంతటా వ్యాపించాయి. దీంతో ఇప్పటి వరకు వందల సంఖ్యలో విద్యార్థులను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. సాధారణంగా అమెరికా పోలీసులు విద్యాసంస్థల్లో ప్రవేశించరు. కానీ నిరసనలు ఎగిసిపడుతుండటంతో రంగప్రవేశం చేయక తప్పలేదు.
యూనివర్శిటీ ఆప్ టెక్సాస్, ఆస్టిన్, న్యూయార్క్ యూనివర్శిటీ, యేల్, ఒహియో స్టేట్, యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా లో విద్యార్థులను అరెస్టు చేసింది. అయితే కొంతమంది యూదులను లక్ష్యంగా చేసుకొని దాడులకు ప్రయత్నించడం కలకలం రేపుతోంది. దీంతో అమెరికా లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. కొంతమంది నిరసన కారులు ఇజ్రాయెల్ జాతీయ జెండాను దహనం చేశారు. హమాస్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాల్సిన అమెరికా చోద్యం చూస్తుండటంతో అగ్రరాజ్యం రక్తసిక్తం అవుతుందేమో అనిపిస్తోంది.