రాష్ట్రంలోని ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారానికి దిగింది. ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ఈ చట్టాన్ని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. ఈ మేరకు 2019లో కేంద్రం ఓ ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. అన్ని రాష్ట్రాలు దీనిని అమలు చేయాలని సూచించింది. దీనికి అనుగుణంగానే ప్రజల ఆస్తులు అన్యా క్రాంతం కాకుండా దేశంలోనే తొలిసారిగా కట్టుదిట్టమైన చట్టాన్ని రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం రూపొందించింది.
దేశంలో మరే రాష్ట్రంలోను ఈ చట్టం రాలేదు. వాస్తవంగా ఈ చట్టాలు ఇంకా రాష్ట్రంలో అమలులోకి రాలేదు. అమలుకు అవసరమైన నిబంధనలు, మార్గదర్శకాలను ఇంకా జారీ చేయలేదు. అవి జారీ అయ్యాక చట్టం అమలవుతుంది. ఇంకా ఏమీ లేకుండానే టైటిల్ రిజిస్టర్ అధికారిగా ఎవరు ఉంటారో తెలియకుండానే.. చాలా అంశాలపై స్పష్టత రాకుండానే స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
అయితే కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అన్ని రాష్ట్రాల్లో తేవాలని చెబుతున్న ఈ చట్టాన్ని వ్యతిరేకించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని కేంద్రం ప్రతిపాదించిన ప్రభుత్వాన్ని వద్దనడం ఏమిటని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని రద్దు చేస్తామని చెప్పడం కొసమెరుపు. మరి దీనిపై బీజేపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.