వైసీపీ విడుదల చేసిన మ్యానిఫెస్టోపై మిశ్రమ స్పందన వస్తోంది. గత ఎన్నికలకు ముందు నవరత్నాల పేరిట జగన్ మ్యానిఫెస్టోని ప్రకటించారు. తొమ్మిది అంశాలను చేర్చారు. అయితే అందులో మద్యపాన నిషేధం, జాబ్ క్యాలెండర్ ప్రకటన, సీపీఎస్ రద్దు వంటి అంశాలు అమలుకు నోచుకోలేదు. అయితే మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను శత శాతం అమలు చేశామని వైసీపీ గొప్పలు చెబుతోంది.


గత ఐదు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం అమలు చేసింది. ఈ తరుణంలో వైసీపీ మ్యానిఫెస్టోపై అందరూ భారీ ఆశలు పెట్టుకున్నారు. తమకు ఏం ఆఫర్లు ప్రకటిస్తారా అని అందరూ టీవీలకు అతుక్కుపోయారు.  కానీ జగన్ మాత్రం ఈసారి రెండు పేజీలతో తొమ్మిది ముఖ్యాంశాలతో కూడిన మ్యానిఫెస్టోని ప్రకటించారు. ఇప్పుడున్న సంక్షేమ పథకాల మొత్తాన్ని స్వల్పంగా పెంచి ఈ మ్యానిఫెస్టోని విడుదల చేశారు.


నవరత్నాలను కొనసాగిస్తూనే.. అభివృద్ధి సుపరిపాలన అందిస్తామని ప్రకటించారు. ఇప్పుడు కొనసాగుతున్న పోర్టులు, మలిక వసతులను మరింత విస్తరిస్తామన్నారు. మొత్తంగా మూడు పథకాలకు మాత్రం ఇచ్చే మొత్తాలను పెంచి మమ అనిపించేశారు. అందులో ఇప్పటి వరకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.75వేలు అందిస్తే.. వచ్చే ఐదేళ్ల కాలంలో రూ.1.50లక్షలు అందిస్తామని హామీ  ఇచ్చారు. కాపు నేస్తం కింద అందించే మొత్తాన్ని రూ.1.20 వేలకు పెంచుతామని స్పష్టం చేశారు.


అలాగే అమ్మ ఒడి పథకం కింద ఇచ్చే పరిధిని రూ.15000 నుంచి రూ.17000పెంపునకు హామీ ఇచ్చారు. అయితే ఈ రెండు వేలను తల్లుల ఖాతాకు కాకుండా పాఠశాల అభివృద్ధికి వెచ్చిస్తామని మెలిక పెట్టారు. వైఎస్సార్ ఆసరా కింద రూ.3లక్షల వరకు సున్నా వడ్డీ ఇస్తామని ప్రకటించేశారు. ఇక బీసీ నేస్తం నాలుగు విడతల్లో రూ.45 వేల నుంచి రూ.లక్ష ఐదు వేల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రైతు భరోసాను రూ.13500 నుంచి రూ.16వేలకు పెంచుతామని వివరించారు. మొత్తానికి మెరుపుల్లేని మ్యానిఫెస్టోని జగన్ ప్రజల ముందు ఉంచారు. మరి ఇది ఏ మేరకు ఏపీ ఓటర్లను ఆకర్షిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: