ఆ నియోజక వర్గాలు వైసీపీ కంచుకోటలు.. అవి ఏ ఎన్నికలైనా.. రాష్ట్రమంతా ఏ గాలి ఉన్నా.. ఆ సీట్లలో మాత్రం వైసీపీదే హవా.. ఇంతకీ ఆ సీట్లు ఏమిటంటారా.. అవే ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు సీట్లు.  నియోజక వర్గాల పునర్విభజన తర్వాత ఎస్సీ నియోజక వర్గాలు పెరిగాయి. ఏపీలో మొత్తం 29 ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాలు ఉన్నాయి. ఇవి మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటలుగా ఉంటున్నాయి. వైసీపీ ఏర్పడిన తర్వాత ఆ కాంగ్రెస్‌ కంచుకోటలు.. వైసీపీ కంచుకోటలుగా మారాయి.


వైఎస్‌ వారసత్వాన్ని జగన్ అందిపుచ్చుకోవడమే అందుకు కారణం. ఈ 29 నియోజక వర్గాల్లో వైసీపీ హవా కొనసాగుతోంది. కడప, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు సహా ఉత్తరాంధ్రలోని రిజర్వుడు నియోజక వర్గాల్లో వైసీపీదే హవా. వైఎస్‌ హయాం నుంచి అమలవుతున్న సంక్షేమ కారణాల కారణంగా జగన్ పేదల పక్షపాతిగా ఉన్న ముద్ర ఇక్కడ వైసీపీ ఆధిపత్యానికి కారణంగా చెప్పుకోవచ్చు.


గ‌త ఎన్నిక‌ల్లో మొత్తం 29 ఎస్సీ, ఎస్టీ నియోజక వర్గాల్లో రాజోలు, కొండ‌పి మిన‌హా అన్నింట్లోనూ వైసీపీ గెలిచిందంటే ఈ నియోజక వర్గాల్లో వైసీపీ పట్టు ఏ మాత్రం ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ఎన్నికల్లో రాజోలులో జనసేన గెలిస్తే.. కొండెపిలో టీడీపీ గెలిచింది. ఇక మిగిలిన రాష్ట్రం పరిస్థితి ఎలా ఉన్నా.. ఈ 29 చోట్ల ఇంకా వైసీపీ హవానే కొనసాగుతోందని చెప్పవచ్చు.  ప్రత్యేకించి రాయలసీమలోని కొన్ని రిజర్వుడు నియోజక వర్గాల్లో టీడీపీకి బలమైన అభ్యర్థులు కూడా దొరకలేదు.


వైసీపీ కూడా ఈ 29 నియోజక వర్గాలపై పెద్ద ఆశలే పెట్టుకుంది. ఇవన్నీ దాదాపుగా తన ఖాతాలో పడే స్థానాలుగా లెక్కలు వేసుకుంటోంది.  ఈ నియోజక వర్గాల్లో వైసీపీకి మొగ్గు ఉంటుందని తెలిసినా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ప్రత్యేకిం మేనిఫెస్టోలో ప్రకటించిన ఆకర్షణీయమైన తాయిలాలు ఇక్కడ పరిస్థితిని తారుమారు చేస్తాయని నమ్ముతోంది. మరి ఈ రిజర్వుడు నియోజక వర్గాలు ఈసారి ఎవరికి  పట్టం కడతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: