2014లో ఉమ్మడి ఏపీ ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయాయి. కానీ విభజన హామీలు, తదితర వాటాల విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. దీనిపై కూర్చొని మాట్లాడుకోవాల్సిన తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించేందుకు చివరకు మనపై పెత్తనాన్ని కేంద్రం చేతిలో పెట్టారు. అప్పటి నుంచి కేంద్రం చెప్పినట్లు వినాల్సి వస్తుంది. ఇప్పుడు తాజాగా ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ ని పార్లమెంట్ సాక్షిగా ఏపీ తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ఏమైనా అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ప్రధాని బదులిస్తూ..
అప్పట్లో ఇచ్చిన హామీల అమలు చేయడానికి మేం చిత్త శుద్ధితో పనిచేశాం. రెండు రాష్ట్రాల పరస్పర అంగీకారంతోనే విభజన చట్టంలోని నిబంధనలను అమలు చేయాలని భావించాం. ఏకాభిప్రాయ సాధన ద్వారా ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించాలని 2014 నుంచి ఇప్పటి వరకు 33 సమీక్షా సమావేశాలు నిర్వహించాం. కానీ ఏకాభిప్రాయం కొరవడక పోవడం వల్ల 89 సంస్థలు, కార్పొరేట్ల విభజన పూర్తి కాలేదు.
ఇందులో కొన్ని విషయాల్లో రెండు రాష్ట్రాలు కోర్టుల్లో కేసులు వేశాయి. దీంతో ఈ అంశాలు తీవ్ర జాప్యానికి కారణం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల పూర్తి సహకారంతోనే ద్వైపాక్షిక సమస్యల పరిష్కారం సాధ్యం అవుతుంది. సమస్యను పరిష్కరించడానికి కేంద్రం ఒక సమన్వయకర్తగా మాత్రమే పనిచేస్తుంది. కానీ అక్కడి ప్రభుత్వాలు గత పదేళ్లుగా రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజా సంక్షేమాన్ని పణంగా పెట్టి సమస్యలను పెండింగ్ లో పెట్టే పంథాను అనుసరించాయి. ఫలితంగా విభజన హామీల అమలు విషయంలో తెలుగురాష్ట్రాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు.