ఏపీలో జరుగుతున్న సార్వత్రిక సమరానికి పోలింగ్ అంకానికి చేరుకుంది. మరొ కొన్ని గంటల్లో ఓటరు దేవుళ్లు తమ అభిమాన పార్టీకి ఐదేళ్ల పాటు అధికారాన్ని కట్టబెట్టనున్నారు. ఇందులో విజయం సాధించాలని ఏపీలో ప్రధాన పార్టీల నేతలు తమ శక్తినంతా ధారపోశారు. కాదు కాదు.. శక్తికి మించి కష్టపడ్డారు. ప్రచారంలో చివరి రోజు.. చివరి నిమిషం వరకు ఓటరు మనసును ప్రసన్నం చేసుకునేందుకు యత్నించారు.


మొత్తం మీద అక్కడక్కడా చిన్న చిన్న ఘర్షణలు మినహా ప్రచారం అయితే సాఫీగా సాగింది. ఈ సమయంలో పవన్ ప్రచార శైలి ఏ విధంగా సాగిందో గమనిస్తే.. ప్రస్తుతం పవన్ కు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకం. ఒకవేళ ఓడితే పవన్ రాజకీయ భవిష్యత్తే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే ఆయన జగన్ ను గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో పనిచేశారు. సీఎం స్థానంలో చంద్రబాబుని కూర్చో బెట్టేందుకు ఓ మినీ యుద్ధమే చేశారు.


ఎందుకంటే 2019లో 151 సీట్లతో ఘన విజయం సాధించిన వైసీపీకి.. ఈ సారి ఎన్నికల్లో టీడీపీ కనీసం పోటీ ఇస్తుందా అనే స్థాయికి ఒకానొక దశలో వెళ్లింది. చంద్రబాబు అరెస్ట్ కావడంతో.. ఇక టీడీపీ పని అయిపోందన్న వారు ఉన్నారు. ఈ సమయంలో పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకొని.. ఆ పార్టీని పైకి లేపారు. దీంతో పాటు వైసీపీతో పోరాడాలంట తమకు కేంద్రం సపోర్టు కావాలని బీజేపీ నేతలతో చివాట్లు తిని మరీ చంద్రబాబుని ఎన్డీయే కూటమిలోకి తీసుకువచ్చారు.


మొత్తం మీద తాను అనుకున్నది సాధించగలిగారు. ఇక జగన్ ను ఓడిస్తానన్న శపథమే మిగిలింది. మరోవైపు పొత్తు నిలబడటం కోసం తనకు తాను త్యాగం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో తీసుకున్నది 21 సీట్లే అయినా చంద్రబాబుతో సమానంగా ప్రచారం చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబుతో  పాటు పోటీ పడి మరీ కష్టపడ్డారు. ఇక ఆయనకు ప్రతికూలంశం ఏమిటంటే.. నమ్ముకున్న నేతలకు టికెట్లు ఇవ్వకపోవడంతో పాటు వారిని దూరం చేసుకోవడం. మొత్తం మీద క్యాడర్ ను అయితే నిలబెట్టుకోగలిగారు. మరి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: