లోకేశ్ గెలుపుపైనా ఎగ్జిట్‌పోల్స్ ఏకాభిప్రాయం
రోజా ఓటమి తప్పదని చెప్పిన ఎగ్జిట్‌పోల్స్
ఎన్నికలపై ఆసక్తి ఉన్న వాళ్లు ఎంతగానో ఎదురు చూసిన ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు కూడా వచ్చేశాయి. కానీ ఆ ఎగ్జిట్‌పోల్స్ కూడా పూర్తిగా రాజకీయ చిత్రాన్ని ఆవిష్కరించలేకపోయాయి. కొన్ని కూటమి గెలుస్తుందని చెబితే.. మరికొన్ని జగన్ గెలుస్తాడని చెప్పాయి. జాతీయ సర్వేలలో ఎక్కువగా కూటమి గెలుస్తుందని చెబితే.. లోకల్ సంస్థలు చేసిన సర్వేలు జగన్ గెలుస్తారని చెప్పాయి. అయితే.. ఏ సర్వే ఏం చెప్పినా.. కొన్ని విషయాల్లో మాత్రం అన్ని సర్వేలు ఒకలాగానే చెప్పాయి.
అదేంటంటే.. ఈసారి ఏపీ అసెంబ్లీలోకి తొలిసారి పవన్ కల్యాణ్, లోకేశ్ అడుగు పెట్టబోతున్నారు. ఏ సర్వే కూడా వీరిద్దరూ ఓడిపోతారని చెప్పలేదు. ఇద్దరూ మంచి మెజారిటీ గెలవబోతున్నారని దాదాపు అన్ని సర్వేలు చెప్పాయి. ఇక హిందూపురంలో బాలయ్య హ్యాట్రిక్ ఖాయమని కూడా దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్ తేల్చి చెప్పేశాయి. ఇక జగన్, చంద్రబాబు తమ స్థానాల్లో ఎలాగూ గెలుస్తారు. అందులో ఎవరికీ అనుమానాలు లేవు. కాబట్టి ఈసారి అసెంబ్లీ ఎన్నికల చిత్రం అదిరిపోయే అవకాశం కనిపిస్తుంది.
అదే సమయంలో ఈసారి అసెంబ్లీలో రోజా కళ తప్పే అవకాశం మెండుగా కనిపిస్తోంది. నగరిలో ఎమ్మెల్యే రోజా ఓటమి తప్పదని చాలా ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. చివరకు జగన్‌దే అధికారం అని చెప్పిన ఆరా మస్తాన్ సర్వే కూడా రోజా ఓడిపోతోందని చెబుతున్నాయి. అంటే దాదాపు పదేళ్ల పాటు అసెంబ్లీలో కనపించిన రోజా.. మరో ఐదేళ్ల పాటు అసెంబ్లీలో కనిపించే అవకాశాలు దాదాపు లేనట్టేనని చెప్పుకోవాలి.
ఈసారి కొత్తగా అసెంబ్లీలో అడుగు పెట్టేవారిలో పవన్ కల్యాణ్, నారా లోకేశ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతున్నారు. వీరిద్దరూ తొలి ఎన్నికల్లో ఓడిపోయిన వారే. పవన్ కల్యాణ్ అయితే ఏకంగా రెండు చోట్లా ఘోరంగా ఓడిపోయారు. నారా లోకేశ్ కొద్దిపాటి తేడాతో గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ సినిమా వచ్చే ఐదేళ్లూ అదిరిపోనుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పేశాయి. ఇక ఓడిపోయే పార్టీకి వచ్చే బలాన్ని బట్టి అసెంబ్లీ రంజుగా సాగుతుందా.. చప్పగా నడుస్తుందా అన్నది తేలుతుంది. మరి అది తెలియాలంటే.. నాలుగో తారీఖుదాకా ఆగాల్సిందే కదా.