మిమ్మల్ని నమ్మి అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం రోడ్డున పడి అలమటించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారన్న హరీశ్ రావు.. గ్రూప్ వన్, డీఎస్సీ తదితర ఉద్యోగాల కోసం చేపట్టిన నియామక ప్రక్రియ కూడా ఉద్యోగార్థులకు చాలా ఇబ్బంది కరంగా మారింది, వారి విజ్ఞప్తిని కనీసం వినే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేకపోవడం శోచనీయమన్నారు. గ్రూప్ వన్ మెయిన్స్ కు 1:100 నిష్పత్తితో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయని.. ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని హరీశ్ రావు వివరించారు.
సీఎల్పీ నేతగా నాడు భట్టివిక్రమార్క ఇదే డిమాండ్ చేశారు... కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు తప్పుకుంటుందో అర్థం కావడం లేదన్న హరీశ్ రావు.. ప్రతిపక్షంలో ఉంటే ఒకమాట ఆధికారంలో ఉంటే వేరొకమాటగా ప్రవర్తించడం ఎందుకని ప్రశ్నించారు. గ్రూప్ 2కు 2000 ఉద్యోగాలు, గ్రూప్ 3 కి 3000 ఉద్యోగాలు కలుపుతామన్న మాటను నిలుపుకోవాలని హరీశ్ రావు సూచించారు. పరీక్షల మధ్య తక్కువ విరామం ఉండడంతో ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామని అభ్యర్థులు అంటున్నారు, ఆ ఒత్తిడితోనే సంగీత అనే అమ్మాయి ఆత్మహత్య కూడా చేసుకుందన్నారు.
ఉద్యోగ నియామకాల పరీక్షల తేదీల మధ్య ఎక్కువ వ్యవధి ఉండేలా షెడ్యూల్ సవరించాలని సూచించిన హరీశ్ రావు.. ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ హామీకి అనుగుణంగా అడుగులు పడలేదన్నారు. వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు గుర్తించి జాబ్ క్యాలెండర్ ప్రకటించి నోటిఫికేషన్లు జారీ చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ అని 11 వేల పోస్టులతోనే ఇచ్చి మోసం చేశారు, ఇచ్చిన మాటకు కట్టుబడాలని సూచించారు.