2014లో బీజేపీ సంకీర్ణంలో టీడీపీ ఉన్నా.. పెద్దగా నోరు విప్పలేని పరిస్థితి. అందుకే విభజన హామీల గురించి టీడీపీ పెద్దగా డిమాండ్ చేయలేదు. ప్రత్యేక హోదా లేదూ.. గీదా లేదూ.. ప్యాకేజీతో సర్దుకు పోండి అంటే ఒప్పుకోక తప్పని పరిస్థితి. పోలవరం జాతీయ హోదాతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. పోనీ.. ఇచ్చిన ఆ ప్యాకేజీ అయినా సరిగ్గా ఇచ్చారా అంటే అదీ లేదు. చంద్రబాబు కూడా అప్పట్లో నాలుగేళ్లు సైలంట్‌గా ఉండి.. చివరి నిమిషంలో హడావిడి చేసి.. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి రాజకీయ లబ్ది కోసం నానా హడావిడి చేశారు తప్ప.. రాష్ట్ర విభజన హామీలు సాధించుకోవాలన్న చిత్తశుద్ధి చూపించలేదు.
ఆ తర్వాత 2019లో అధికారానికి వచ్చిన జగన్.. మొట్టమొదటి రోజే దిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చేతులెత్తేశాడు. కేంద్రంలో బీజేపీ సర్కారుకు ఫుల్ మెజారిటీ ఉంది.. వాళ్లు మనం ఏం అడిగినా ఇవ్వరు.. అయినా సరే అడుక్కోవాల్సిందే.. అని క్లారిటీ ఇచ్చేసి.. ఆ తర్వాత ఆ అడగడకం కూడా మానేశాడు. దీంతో ప్రత్యేక హోదా అనేది పూర్తిగా అటకెక్కేసింది. ఇంకా కొన్ని కీలకమైన హామీలకూ అదే గతి పట్టింది.
కానీ ఇప్పుడు సీన్ మారింది. మోడీ ప్రధాని అయ్యాక తొలిసారి బీజేపీ మైనారిటీ సర్కారు ఏర్పడింది. అందులోనూ టీడీపీ ఎన్డీఏలో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఇప్పుడు చంద్రబాబు మద్దతు మోడీకి చాలా అవసరం. మరి ఈ పరిస్థితిని చంద్రబాబు ఉపయోగించుకుంటారా.. ఇవాళ్టి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. మరి చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తారా.. పోలవరానికి దండిగా నిధులు ఇప్పించుకుని పూర్తి చేస్తారా.. కొత్త రాజధాని మౌలిక సదుపాయాలు సాధిస్తారా.. గ్రాంట్ల కింద నిధులు దండిగా ఇప్పించుకుంటారా అన్నది చూడాలి. జగన్‌కు లేని అవకాశం చంద్రబాబుకు ఉంది. మరి ఆ అవకాశాన్ని ఆయన ఎంత వరకూ సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.