పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత మరోసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. మరోసారి ఆపరేషన్ ఆకర్షకు తెర తీశారు. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ప్రారంభారు. ఎన్నికల సమయంలోనూ ఇలాంటి ఫిరాయింపులను ప్రోత్సహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా అదే ధోరణి కొనసాగిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో జీరో ఫలితాలతో డీలా పడిపోయిన బీఆర్‌ఎస్‌ను ఇదే అదనుగా దెబ్బ తీసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.


ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి.. మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. ఈ చేరిక బీఆర్ఎస్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఆయన పార్టీ మారతాడని ఎవరూ ఊహించలేదు. ఆ తర్వాత తాజాగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ను పార్టీలో చేర్చుకున్నారు. అయితే పోచారం విషయంలో ఎలాంటి వివాదం లేకపోయినా.. సంజయ్‌కుమార్ విషయంలో స్థానిక నాయకుడైన ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డికి తెలియకుండా సంజయ్‌ కుమార్‌ను చేర్చుకోవడం వివాదానికి దారి తీసింది.


బీఆర్‌ఎస్‌ నుంచి జగిత్యాలలో గెలిచిన సంజయ్‌కుమార్‌.. సీనియర్ నేత జీవన్‌ రెడ్డిపైనే గెలిచారు. తన ప్రత్యర్థిని పార్టీలోకి తీసుకునేటప్పుడు కనీసం తనను సంప్రదించకపోవడం జీవన్‌ రెడ్డిని బాధించింది. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని బెదిరిస్తున్నారు. దీంతో ఆయన్ను సముదాయించేందుకు రేవంత్ రెడ్డి శ్రీధర్‌ బాబును పంపించారు. రాజీనామా యోచన లో ఉన్న ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డిని మంత్రి శ్రీధర్ బాబు బుజ్జగించే ప్రయత్నం చేశారు.


40 ఏళ్లుగా రాజకీయంలో ఉన్న తనకు తెలియకుండా సంజయ్‌ను పార్టీలో చేర్చుకోవటంపై జీవన్‌ రెడ్డి తీవ్ర మనస్థాపంతో ఉన్నారు. ఇలాంటి విషయాల్లో రేవంత్ రెడ్డి దూకుడు పార్టీకి నష్టం చేకూరుస్తుందన్న వాదన వినిపిస్తోంది. పార్టీని బలోపేతం చేయడం.. బీఆర్‌ఎస్‌ను బలహీన పరచడం రాజకీయ వ్యూహమే అయినా.. సీనియర్లను లెక్క చేయకుండా కనీసం సంప్రదించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనవసర వివాదాలకు తావివ్వడమే అవుతుంది. ఇలాంటి విషయాల్లో రేవంత్ రెడ్డి కాస్త అందరినీ కలుపుకుపోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: