ఏపీ మాజీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి.. తన రాజకీయ జీవితంలోనే అత్యంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇటీవలి ఎన్నికల్లో తన పార్టీ ఘోరంగా ఓడిపోయింది. 175 సీట్లలో పోటీ చేసి కేవలం 11 స్థానాలు దక్కించుకుంది. విపక్ష కూటమి ఏకంగా 164స్థానాలతో ఘన విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్‌ను కష్టాలు చుట్టుముట్టడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ కష్టాలను తట్టుకుని ఎంతవరకూ నిలబడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.


జగన్‌పై ఇప్పటికే ఎన్నో పాత కేసులు ఉన్నాయి. ఆయన ఇప్పటికీ బెయిల్ పైనే ఉన్న నాయకుడు. విదేశాలకు వెళ్లాలన్నా కోర్టులు పర్మిషన్‌ ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఆదుకునేందుకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వంలో టీడీపీ కూడా ఉంది. మరోవైపు టీడీపీ అవసరం ఇప్పుడు ప్రధాని మోదీకి చాలా ఉంది. ఈ నేపథ్యంలో కేసుల విషయంలో మోడీ, అమిత్‌షాలు జగన్‌కు గతంలోలా సహకరించకపోవచ్చు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ నేతలను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. చివరకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కూడా జైల్లో పెట్టించారు.


ఇప్పుడు టీడీపీ నేతలు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. అందువల్ల జగన్ పాత కేసులతో పాటు.. ఇప్పుడు ఈ ప్రభుత్వం పెట్టే కొత్త అవినీతి కేసులు కూడా జగన్ మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. జగన్ హయాంలో ఎన్నో ఒప్పందాలు చేసుకున్నారు. ప్రభుత్వ పరంగా నిధులు మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిపై టీడీపీ ప్రభుత్వం విచారణ చేయించుకుండా ఉండదు. వాటిలో జగన్‌ను దోషిగా చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇది జగన్‌ను బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.


మరోవైపు.. పార్టీ పరంగానూ టీడీపీ సర్కారు.. వైసీపీ నేతలను టార్గెట్‌ చేస్తుందనడంలో సందేహం లేదు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు టీడీపీ వ్యవహరించే అవకాశం లేకపోలేదు. వైసీపీ ఆర్థిక వనరులపై కూడా టీడీపీ ప్రభుత్వం కన్నేస్తుంది. కట్టడి చేస్తుంది. వీటన్నింటినీ ఎదుర్కొని పార్టీని బతికించుకోవడం జగన్‌కు సవాలుగా మారనుంది. కేవలం 11 సీట్లు మాత్రమే రావడంతో ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధంగా లేదు. అసెంబ్లీలోనూ పోరాడే అవకాశం కనిపించట్లేదు. మొత్తానికి జగన్‌కు ముందు ఉన్న ఐదేళ్లు గడ్డు కాలమే. మరి అర్జునుడిలా పద్మవ్యూహాన్ని చేధిస్తారా.. లేక.. అభిమన్యుడిలా మారతారా అన్నది కాలం తేల్చాల్సిన ప్రశ్న.


మరింత సమాచారం తెలుసుకోండి: