ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీని కష్టాలు చుట్టుముట్టనున్నాయి. ప్రత్యేకించి వైసీపీ క్యాడర్‌ బాగా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణంగా జగన్‌ అధికారం ఉన్నప్పుడు చూపించిన వైఖరే కారణంగా కనిపిస్తోంది. గతంలో టీడీపీ నేతలను తమను బాగా ఇబ్బంది పెట్టారన్న కారణంతో వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయారు. టీడీపీ నేతలను ఒక ఆట ఆడుకున్నారు. నిత్యం కేసులు, దాడులతో టీడీపీ నేతలను ఉక్కిరి బిక్కిరి చేశారు.


ఇక ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోయింది. దీంతో ఇప్పుడు ఆడుకునే సమయం టీడీపీకి వచ్చినట్టు భావించాలి. తమను ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలను తాము కూడా వదలబోమన్న కసి, పట్టుదల టీడీపీ నేతల్లో కనిపిస్తూనే ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే వైసీపీ నేతలపై దాడులు ప్రారంభమైపోయాయి. ఇక ఈ దాడుల పరంపర కొనసాగే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఆ పార్టీ యువ నేత నారా లోకేశ్‌గా చెప్పుకోవచ్చు.


గతంలో చంద్రబాబు హయాంలో ఇలాంటి కక్ష రాజకీయాలకు పెద్దగా ఆస్కారం ఉండేది కాదు. రాజకీయాలను రాజకీయాలుగానే చేయాలి. రాజకీయాల్లో హింస ఎక్కువ ఉండకూడదన్నది చంద్రబాబు వైఖరిగా కనిపించేది. కానీ ఇప్పుడు టీడీపీలో నడుస్తున్నది నారా లోకేశ్ శకం. నారా లోకేశ్‌ చంద్రబాబులా కాదు.. ఆ విషయాన్ని ఎన్నికల ప్రచారంలో తానే చెప్పుకొచ్చాడు. నేను చంద్రబాబులా సాఫ్ట్‌ కాదు.. ఎన్నికల ప్రచారంలోనూ.. అంతకు ముందు కూడా వైసీపీ నేతలకు వార్నింగ్ ఇస్తూ నారా లోకేశ్‌.. అధికారంలోకి వస్తే ఏ ఒక్కరినీ వదిలి పెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.


ఈ కక్ష సాధింపుల కోసం ఆయన ఏకంగా రెడ్‌ బుక్‌ అనే కాన్సెప్టును కూడా తీసుకొచ్చాడు. ప్రతి సభలోనూ ఈ రెడ్‌ బుక్‌ ను ప్రదర్శిస్తూ.. ఇందులో పేర్లు రాసుకుంటున్నా.. అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కరినీ వదలను అంటూ నారా లోకేశ్‌ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు అదే రెడ్‌ బుక్‌ వైసీపీ పాలిట శాపంగా మారే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య కక్ష సాధింపులు పీక్స్‌కు చేరుకున్నాయి. మరి వైసీపీ నేతలు ఎంత వరకూ తట్టుకుని నిలబడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: