ఢిల్లీ మద్యం సీబీఐ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం విధానం సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. కేజ్రీవాల్ ను అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది. మొన్న తీహార్ జైలులో కేజ్రీవాల్ ను ప్రశ్నించిన సీబీఐ.. విచారణ సందర్భంగా కేజ్రీవాల్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. ఇవాళ ట్రయల్ కోర్టు ముందు కేజ్రీవాల్ ను సీబీఐ హాజరుపరచనుంది. కేజ్రీవాల్ ను కోర్టు ముందు హాజరుపరిచేందుకు సీబీఐ అనుమతిపొందింది.


ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న అర్వింద్ కేజ్రీవాల్‌కు ఇది మరో షాక్‌ అనుకోవచ్చు. మార్చి 21 న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. వారం రోజులపాటు తమ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించిన ఈడీ.. అనంతరం జ్యుడీషియల్ కస్టడీ కి తరలించింది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మే 10 నుంచి జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ పై విడుదలైన కేజ్రీవాల్.. బెయిల్ ముగిసిన అనంతరం... సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తిరిగి జూన్ 2 మధ్యాహ్నం తీహార్ జైల్లో లొంగిపోయారు.


అయితే ఇప్పటికే కేజ్రీవాల్‌ జైల్లో ఉండటంతో సీబీఐ అరెస్టుతో పెద్దగా జరిగే నష్టం ఏమిటని కొందరు భావించవచ్చు. కానీ.. సీబీఐ కేసు వల్ల కేజ్రీవాల్ కష్టాలు రెట్టింపు అవుతాయి. రేపు ఈడీ కేసులో బెయిల్ వచ్చినా ఆయన విడుదలయ్యే అవకాశం ఉండదు. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్ వచ్చినప్పుడే కేజ్రీవాల్‌ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కేజ్రీవాల్ కష్టాలు రెట్టింపయ్యాయని చెప్పుకోవచ్చు.


ఈడీ కేసులో జైలులో ఉన్నా ఇంకా కేజ్రీవాల్‌ దిల్లీ సీఎంగానే కొనసాగుతున్నారు. ఇప్పటికీ ఆ పదవిని ఆయన ఎవరికీ ఇవ్వలేదు. జైలు నుంచే పాలన సాగిస్తున్న సీఎంగా చరిత్ర సృష్టిస్తున్నారు. కానీ ఈ కేసుల దాడి పెరిగితే ఆయన సీఎం పదవి వదలక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు. మొత్తానికి ఆప్‌ను అతలాకుతలం చేయాలన్న బీజేపీ తన లక్ష్యం నెరవేర్చుకునేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: