జగన్‌ గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. ఎంతగా ఓడిపోయారంటే.. అంత ఘోరంగా ఏపీ చరిత్రలో ఏ పార్టీ కూడా ఓడిపోలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయి స్థానాలు దక్కించుకుని గెలిచి.. తదుపరి ఎన్నికల్లో అంత దారుణంగా ఓడిన మరో నేత చరిత్రలో లేడు. మరి ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి.. జగన్ రాజకీయ జీవితం ముగిసిపోయినట్టేనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. మళ్లీ జగన్‌ విజయం సాధించగలడా.. మళ్లీ వైసీపీ అధికారం కళ్ల జూస్తుందా.. ఈ ప్రశ్నలకు అవునని సమాధానం చెప్పాలంటే.. జగన్ చేయాల్సిన పనులు ఐదు ఉన్నాయి. అవేంటో చూద్దాం.


జగన్ మళ్లీ గెలవాలంటే ముందుగా చేయాల్సిన పని ఓటమిని అంగీకరించడం.. ఈవీఎం అక్రమాలతో ఓడిపోయాం అనే ఆలోచనలు మానేయాలి. జనం ఘోరంగా వైసీపీని ఓడించారన్నది పచ్చినిజం. దాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే.. పార్టీ అంత త్వరగా కోలుకుంటుంది. ఓటమిని అంగీకరించి దానికి కారణాలను  గుర్తించాలి. ఇందుకు సొంత పార్టీ నేతలతో చర్చించడం కాకుండా.. నిష్పాక్షికంగా తప్పులు చెప్పగలిగే తటస్తులను గుర్తించి వారితో తమ లోపాలేంటో చెప్పించుకోవాలి. ఆ లోపాలపై పార్టీలో చర్చ జరగాలి.


జగన్ చేయాల్సిన రెండో పని.. నిత్యం జనంలో ఉండాలి. అధికార పార్టీకి కొంత సమయం ఇచ్చి.. ఆ తర్వాత ప్రజా సమస్యలపై పోరాడాలి. ఓడినా.. గెలిచినా జనంలోనే ఉంటామన్న భరోసా కల్పించాలి. ఏదో విపక్షంగా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం చేసిన ప్రతి కార్యక్రమాన్ని తప్పుబడతాం అనే పద్ధతిలో కాకుండా.. జనం నిజంగా ఇబ్బంది పడుతున్న సమస్యలను గుర్తించి  వాటిపై పోరాటం ప్రారంభించాలి.


జగన్ చేయాల్సిన మూడో పని.. పార్టీలోని బూతుల నేత నోళ్లు కట్టేయాలి. ఇలాంటి నేతలతో పార్టీ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటి వారిని కట్టడి చేయకపోతే.. వైసీపీపై ఆ ముద్ర పోదు. జగన్ చేయాల్సిన నాలుగో పని.. పార్టీలో ప్రజాస్వామ్య వైఖరి నెలకొల్పాలి. గతంలో వైఎస్సార్‌ నిత్యం నేతలకు, ప్రజలకు అందుబాటులో ఉండేవాడు. జగన్ సీఎం అయ్యాక ఆ పరిస్థితి లేదు. మళ్లీ పాత పరిస్థితి తీసుకురావాలి. జగన్ చేయాల్సిన ఐదో పని.. కూటమి హామీలపై నిలదీయడం. కూటమి సర్కారు అలవిగాని హామీలు ఇచ్చింది.. వాటి అమలుపై ఎప్పటికప్పుడు నిలదీస్తూ ప్రజలను చైతన్య పరచాలి. ఈ వ్యూహంతో జగన్ ముందుకు వెళ్తే.. మళ్లీ అధికారం చేజిక్కించుకోవడం అసాధ్యం ఏమీ కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: