ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని ఎన్నికల సంఘం అంటోంది. మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్టే ఇందుకు నిదర్శనమని ఈసీ చెబుతోంది. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనకు సంబధించి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసి పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఈసీ స్పందించింది. ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించే విషయంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా మాజీ శాసనసభ్యుడి అరెస్టు ఒక గుణపాఠం అని ఈసీ చెబుతోంది.


ఈవీఎం ద్వంసానికి కారణమైన మాజీ ఎమ్మెల్యే అరెస్టు తో ఈ ఘటనకు తార్కికమైన ముగింపు లభించిందన్న ఈసీ.. చట్టానికి ఎవరూ అతీతులు కారని ఈ అరెస్టు నిరూపించిదని చెబుతోంది. ప్రజాస్వామ్యాన్ని బెదిరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవటం ఆవశ్యకమన్న ఈసీ.. ఈ తరహా నిందితుల్ని అరెస్టు చేయటం ఎన్నికల సమగ్రతను కాపాడుకోవటమేనని అంటోంది.


మే 13 తేదీన ఎన్నికల్లో మాచర్ల లోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రం 202లో అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  ఈవీఎం ధ్వంసం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం.. వీడీఓ ఫుటేజి పరిశీలన అనంతరం ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్టు చేయాలని మే 21 తేదీన ఆదేశించింది. గత శాసనసభలో సిట్టింగ్ సభ్యుడు ఈవీఎంను ధ్వంసం చేయటం నేరపూరిత చర్యతో పాటు ప్రజాస్వామ్యంపై జరిగిన ఘోరమైన దాడిగా పరిగణించినట్టు తెలిపిన ఈసీ ఆయనపై చర్యలకు ఉపక్రమించింది.


అయితే.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోర్టులను ఆశ్రయించారు. తనకు బెయిల్ ఇప్పించాలని వేడుకున్నారు. ముందుగా వాదనలు విన్న కోర్టులు.. మధ్యంతర బెయిల్‌ ఇచ్చాయి. ఆ తర్వాత కేసులపై విచారణ కొనసాగించాయి. ఈ విచారణ తాజాగా కొలిక్కి వచ్చింది. ఇటీవల తీర్పు రిజర్వ్‌ చేసిన హైకోర్టు న్యాయమూర్తి.. నిన్న పిన్నెల్లి బెయిల్‌ పిటిషన్లను కొట్టేశారు. ప్రభుత్వం కూడా మారడంతో పిన్నెల్లిని కష్టాలు చుట్టుముట్టాయనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: