వైసీపీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అగ్రనేతగా ఉన్నారు. పార్టీలో జగన్‌ తర్వాత బలమైన నేతగా గుర్తింపు పొందారు. అయితే అధికారం కోల్పోవడంతో ఆయనకు కూడా కష్టాలు మొదలయ్యాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఎదురు దెబ్బ తగిలింది. పుంగనూరు మున్సిపల్‌ ఛైర్మన్‌ అలీంబాషా, మరో 12 మంది కౌన్సిలర్లు వైసీపీకి గుడ్‌ బై చెప్పారు. టీడీపీ పుంగనూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డిని వీరు రొంపిచెర్లలోని ఆయన ఇంట్లో కలిశారు. వీరు త్వరలోనే వైసీపీలోకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.


గత మున్సిపల్‌ ఎన్నికల్లో వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికకావడం విశేషం. అప్పట్లో టీడపీ నుంచి ఎవరూ నామినేషన్లు వేయలేదు. పెద్దిరెడ్డి మంత్రాంగం వల్లే ఇలా జరిగిందని టీడీపీ నేతలు అప్పట్లో ఆరోపించారు. అలాంటిది అప్పుడు వైసీపీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన వారే ఇప్పుడు అధికారం పోయే సరికి మాజీ మంత్రి పెద్దారెడ్డిపై తిరుగుబాటు చేస్తున్నారు. పెద్దిరెడ్డి తమకు పదవులు మాత్రమే ఇచ్చి పెత్తనమంతా ఆయనే చేశారని ఛైర్మన్‌ అలీంబాషా, కౌన్సిలర్లు అమ్ము, మనోహర్‌ విమర్శించారు.


ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, చల్లా రామచంద్రారెడ్డిలతో కలిసి పనిచేసి తమ వార్డులను అభివృద్ధి చేసుకుంటామని ఛైర్మన్‌ అలీంబాషా, కౌన్సిలర్లు అమ్ము, మనోహర్‌ అంటున్నారు. పుంగనూరు పరిధిలో మొత్తం 31 మంది వార్డు కౌన్సిలర్లు ఉన్నారు. అయితే ప్రస్తుతం 13 మంది వైసీపీకి రాజీనామా చేశారన్నమాట. చల్లా రామచంద్రారెడ్డిని కలిసిన వారిలో మున్సిపల్‌ ఛైర్మన్‌ అలీంబాషా, కౌన్సిలర్లు రామకృష్ణరాజు, రహంతుల్లా, జె.నరసింహులు, యువకుమారి, మమత, వి.కాళీదాస్‌మొదలియార్, ఖాన్‌ నూర్జహాన్, కసురున్నీసా, మనోహర్, హర్షద్‌అలీ, రేష్మా, మహ్మద్‌గౌస్‌ తదితరులు ఉన్నారు.


పుంగనూరులో జరిగింది ట్రైలర్ మాత్రమేనని.. ఇక ముందు ఇంకా పెద్దారెడ్డికి అసలు సినిమా చూపిస్తామని టీడీపీ నేతలు అంటున్నారు. అధికారం అడ్డుపెట్టుకుని పుంగనూరు సహా చిత్తూరు జిల్లాలో పెద్దారెడ్డి ఎన్నో అక్రమాలు చేశారంటున్న టీడీపీ నేతలు.. ఇప్పుడు అన్నింటికీ బదులు తీర్చుకుంటామని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: