చంద్రబాబు.. దేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన నేతల్లో ఒకరు. ఏపీకి ఆయన 14 ఏళ్లు సీఎంగా పని చేశారు. ఈ టర్మ్‌ కూడా పూర్తి చేసుకుంటే 20 ఏళ్లు సీఎంగా పని చేసిన రికార్డు సాధిస్తారు. అలాగే అత్యధిక కాలం విపక్షంలో ఉన్న నేత కూడా ఆయనే కావచ్చు. దాదాపు 15 ఏళ్లు విపక్షంలో ఉన్నారు. అయితే విపక్షంలో ఉన్నప్పుడు బెంబేలెత్తిపోకుండా.. పార్టీని కాపాడుకుంటూ నిత్యం ప్రజల్లో ఉండటం చంద్రబాబు ప్లస్ పాయింట్‌. చంద్రబాబుకు ఉన్న ఈ ప్లస్ పాయింట్‌ను మిగిలిన నాయకులు కూడా ఫాలో అవ్వాలి.


అయితే చంద్రబాబు విపక్షంలో చేసిన పని.. కేసీఆర్‌ చేయలేకపోతున్నారా.. అంటే అవునంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి.. అధికార పక్షం వాళ్లు తిట్టే తిట్లు, చేసే కామెంట్లను తట్టుకొని పోరాడారని రేవంత్ రెడ్డి అంటున్నారు. కోర్‌ ఏరియాను చంద్రబాబు వదల్లేదని రేవంత్ రెడ్డి అన్నారు. కానీ ఇక్కడ కేసీఆర్ ఆ పని చేయడం లేదని, హరీశ్‌రావు ఆ పని చేయించడం లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.


ప్రస్తుతం కేసీఆర్ పార్టీని నిలబెట్టుకునే మూడ్‌లో లేరని రేవంత్ రెడ్డి అంటున్నారు. కేసీఆర్ ఇప్పుడు హరీశ్‌ ట్రాప్‌లో ఉండటంతో బీఆర్ఎస్ బతకడం కానీ, కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవడం కానీ జరగదని రేవంత్ రెడ్డి విశ్లేషించారు. ఈరోజు భావోద్వేగాలు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..  అందువల్ల ఆయన హేతుబద్ధంగా ప్రవర్తిస్తేనే గులాబీ పార్టీ బతుకుతుందని విశ్లేషించారు.


పార్టీ బతికితే కేసీఆర్ తర్వాత కేటీఆర్, కవిత ఉంటారు తప్ప, హరీశ్ రావు ఉండరని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకే బీఆర్ఎస్ ఖతం కావాలని కోరుకుంటున్న వారిలో మొదటి, చివరి వ్యక్తి హరీశ్‌రావేనని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈటల రాజేందర్, నరేంద్ర, విజయశాంతిలను బయటికి గెంటించింది హరీశేనని రేవంత్ రెడ్డి విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: