ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయి ఇటీవలే 10 ఏళ్లు పూర్తయ్యాయి. ఉమ్మడి రాజధానిగా ఈ పదేళ్ల పాటు హైదరాబాద్‌ ఉంది. ఆ గడువు కూడా పూర్తయింది. ఇక ఇప్పుడు ఏపీ, తెలంగాణ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే. అయితే.. పదేళ్లయినా ఇంకా ఏపీ, తెలంగాణ విభజన సమస్యలు కొన్ని పెండింగ్‌లోనే ఉన్నాయి. ఉద్యోగుల పంపిణీ, విద్యుత్‌ బకాయిల చెల్లింపు, దిల్లీలో ఆస్తుల విభజన వంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. అయితే.. వీటిలో అనేక కొర్రీలు, మెలికలు ఉన్నాయి. అందువల్లే ఇన్నాళ్లపాటు ఈ సమస్యలు నలుగుతున్నాయి.


ఈ విభజన సమస్యలను పరిష్కరించే ప్రయత్నం గతంలో కొంత వరకూ జరిగినా కొన్ని సమస్యలు మాత్రం అపరిష్కృతంగానే ఉండిపోయాయి. ఈ బాధ్యత చూడాల్సిన కేంద్ర హోంశాఖ అడపాదడపా కొన్ని సమావేశాలు నిర్వహిస్తూ రోజులు నెట్టుకొస్తోంది. అయితే.. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు సీఎం కావడంతో.. తెలంగాణలో ఆయన శిష్యుడుగా పేరున్న రేవంత్ రెడ్డి సీఎం కావడంతో వీరిద్దరూ త్వరలో భేటీ కావాలని నిర్ణయించారు.


ఈ భేటీకి ఏపీ సీఎం చంద్రబాబు నుంచే చొరవ కనిపించింది. ఈనెల 6న హైదరాబాద్‌ వచ్చి మీతో సమావేశం అవుతాను.. సమస్యలు పరిష్కరించుకుందా అంటూ చంద్రబాబే సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.  ఈ లేఖ పట్ల సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగానే స్పందించే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెల 6న చంద్రబాబు, రేవంత్ రెడ్డిల సమావేశం హైదరాబాద్‌లో జరిగే అవకాశం ఉంది.
ఇదే జరిగితే అది చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది.


అయితే.. గతంలో కేసీఆర్, జగన్‌ కూడా జగన్ సీఎం అయిన మొదట్లో భేటీ అయ్యారు. ఉమ్మడి సమస్యలు పరిష్కరించుకుందామని అనుకున్నారు. అనుకున్నట్టుగానే పలు విడతలుగా చర్చలు జరిపారు. అనేక ప్రతిపాదనలపై చర్చించారు కూడా. కానీ ఆ తరవాత ఎక్కడో వారిద్దరికీ చెడింది. అంతే ఆ చర్చలు ఫలప్రదం కాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబుల మీటింగ్‌ అనేసరికి ఈ పాత చర్చలు గుర్తుకు వస్తున్నాయి. మరి చంద్రబాబు, రేవంత్ రెడ్డి చర్చలయినా ఫలప్రదం అవుతాయా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: