- తొడ‌కొట్టి మ‌రీ డోన్‌లో సీఎం కోట్లపై పోటీ చేసిన రేణుక‌
- ఎవ‌రైనా ఐ డోన్ట్ కేర్ అన్న రాజ‌కీయ‌మే ఆమె నైజం
- కార్పొరేట‌ర్ టు కేంద్ర మంత్రిగా ఎదిగిన వైనం

( ఖ‌మ్మం - ఇండియా హెరాల్డ్ )

రాజకీయాలను శాసించి సాధించిన నాయకురాలు రేణుక చౌదరి. రాజకీయాలు-రేణుక వేరువేరు కాదని నిరూపించిన నాయకురాలు ఆమె. రేణుకంటే రాజకీయాలు, రాజకీయాలు అంటే రేణుక అన్నట్టుగా ఆమె వ్యవహరించారు. పార్టీలు మారినా సిద్ధాంతాలు మారకుండా ముక్కుసూటి తనంతో.. ఒకరకంగా చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి మాట్లాడడంలో రేణుకా చౌదరిని మించిన నాయకురాలు లేదంటే ఆశ్చర్యం వేస్తుంది. అన్యాయం అక్రమాలను సహించలేని మనస్తత్వం, దొడ్డిదారి రాజకీయాలు చేయలేని బలహీనత రేణుక చౌదరి సొంతం.


ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుత రాజకీయ పరిణామాలు అవకాశవాదానికి గొడుగు పడుతున్నాయి. కానీ, రేణుక ఏనాడు అవకాశవాదం జోలికి ఎప్పుడు పోలేదు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని తాను నమ్మిన బాటలో నడవడానికి ఆమె ఎన్ని కష్టాలైనా ఓర్చుకున్నారు. ఒకానొక దశలో ఆమెకు రాజకీయాలు ముగిసిపోయాయి అని అనుకున్న సందర్భం వచ్చేసింది. అయినా ముక్కవోని దీక్షతో ఉన్న పార్టీలోనే పోరాడి తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుని ప్రజలతో జేజేలు కొట్టించుకున్న మహిళ నాయకురాలు. ఫైర్ బ్రాండ్ రేణుక చౌదరి.


1984లో అన్నగారు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున ప్రజల్లోకి తిరిగి  రేణుకా చౌదరి తర్వాత కాలంలో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు. 1986లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికల్లో కార్పొరేటర్ గా గెలిచారు. మళ్ళీ తనకు తన సిద్ధాంతాలకు కాంగ్రెస్ పార్టీకి సరిపడడం లేదని భావించిన ఆమె 1986లో తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసారు. ఇక అప్పటినుంచి 1998 వరకు ఆమె వెనుదిరిగి చూడలేదు. రెండుసార్లు కేంద్ర మంత్రిగా రాజ్యసభ సభ్యురాలుగా ఉంటూ మంత్రి పదవిని చేపట్టారు. అది కూడా బలమైన టిడిపి నుంచి ఎన్నిక కావడం గ‌మ‌నార్హం.


రాజ్యసభ సభ్యురాలుగా ఉండి దేవగౌడ మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అవకాశం ఒక రేణుక చౌదరికి మాత్రమే దక్కడం విశేషం. ఆమె మాట, ఆమె ఆలోచన ఎట్లాంటి సమస్యనైనా ఎదుర్కొనే తీరు వంటివి రేణుకా చౌదరికి పెట్టని ఆభరణాలుగా నిలిచాయి. రాజకీయాల్లో ఎంతోమంది వచ్చారు ఎంతోమంది వెళ్లిపోయారు. కానీ రేణుకా చౌదరి ప్రస్థానం ఒక అనన్య సామాన్యమనే చెప్పాలి. ఏ విషయాన్నైనా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం లో రేణుక చౌదరి సిద్ధహ‌స్తురాలు. తన-మన అనే తేడా లేకుండా ఏది మంచి అయితే దాని వైపే నిలబడటం ఆమె పెంచి పోషించుకున్న రాజకీయ లక్షణం. ఇది ఆమెకు మేలు చేసింది తప్ప ఎన్నడు కీడు చేయలేదు.


1998లో మళ్లీ టిడిపితో విభేదించి కాంగ్రెస్‌లో చేరారు. ఇక అప్పటినుంచి ఆమె కాంగ్రెస్ లోనే ప్రస్తుతం కొనసాగుతున్నారు. 1999, 2004లో ఖమ్మం లోక్‌స‌భ‌ స్థానం నుంచి వరుస విజయాలు దక్కించుకున్న ఆమె కేంద్ర మంత్రిగా రెండుసార్లు పనిచేశారు. 2009లో ఆమె ఓడిపోయారు. 2024లో అంటే ఈ సంవత్సరంలో తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యురాలుగా ఎంపికయ్యారు. పార్టీలో పదవులు ఇచ్చిన ఇవ్వకపోయినా పార్టీ తరఫున గళం వినిపించడంలో రాజీలేని దారుణతో రేణుక చౌదరి వ్యవహరించారు. టీడీపీలో ఉన్న‌ప్పుడు ఆమె అప్ప‌టి ముఖ్య‌మంత్రి కోట్ల విజ‌య్‌భాస్క‌ర్‌రెడ్డిపై డోన్‌లో పోటీ చేసి ఓడిపోయినా కూడా 33 వేల ఓట్లు తెచ్చుకుని కోట్ల‌నే ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.


ఈ క్రమంలో ఆమె కొన్ని సమస్యలను ఎదురోడ్డున పరిస్థితి ఉంది. కొన్ని అవమానాలను భరించిన పరిస్థితి కూడా ఉంది. అయినా ఏనాడూ ఆమె తాను నమ్మిన సిద్ధాంతానికి తల వంచిన పరిస్థితి అయితే లేదు. మాట కటువైనా.. మనసు వెన్న అనే నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో రేణుక చౌదరి ముందుంటారు. అమరావతి రాజధాని విషయంలో ఎవరు కోరకుండానే వచ్చి రైతులకు మద్దతు తెలిపిన రేణుక చౌదరి.. అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డిని బలంగా హెచ్చరించారు. అమరావతికి అన్యాయం చేస్తే అధికారం పోతుందని చెప్పుకొచ్చారు అదే జరిగింది. అంటే రేణుక చౌదరి దూర‌ దృష్టికి ఇది ఒక నిదర్శనం. రేణుక చౌదరి లాంటి నాయకురాలు తెలుగు రాష్ట్రాలకు ఉండటం నిజంగా మహిళ నేతల్లో ఒక గర్వకారణమని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: