- అమెరికా టు తెలంగాణ ఉద్య‌మంలోకి..
- తెలంగాణ జాగృతితో పీక్స్‌లోకి ప్ర‌త్యేక రాష్ట్రోద్య‌మం
- 2014లో నిజామాబాద్ ఎంపీగా.. 2020లో ఎమ్మెల్సీగా విజ‌యం

( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ )

కల్వకుంట్ల కవిత ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలంగాణ ఉద్యమంతో మమేకమైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయగా రాజకీయ రంగం చేసిన కవిత.. త‌ర్వాత కాలంలో తనకంటూ ప్రత్యేక వేదిక నిర్మాణం చేసుకొని తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని దేశంలోనే ఎన్నదగిన మహిళ నాయకురాలిగా ఎదిగారు. దక్షిణ భారతదేశ నుంచి కీలక పాత్ర పోషించారు. 2006లో తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో అమెరికా నుంచి కుటుంబంతో సహా హైదరాబాదుకు తరలివచ్చిన కవిత అక్కడి నుంచి వెనుదిరిగి చూడని విధంగా రాజకీయాల్లో తన పాత్రను సుదీర్ఘంగా పోషించారు.


తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రను తనదైన శైలిలో ముందుకు తీసుకువెళ్లారు. 2006లో నల్గొండ జిల్లాలోని కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని అక్కడే పేద పిల్లలను చదివించడం ద్వారా గుర్తింపు సాధించారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని తన తండ్రి ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళుతున్నారో ఖచ్చితంగా అదే విధంగా మహిళల్లోకాన్ని కదిలించాలని కంకణం కట్టుకుని కవిత ముందుకు సాగారు. తన పదునైన మాటలతో తెలంగాణ యాసలో అహరహం తెలంగాణ వాదాన్ని వినిపించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.


గ్రామస్థాయిలో ముఖ్యంగా మహిళలను కదిలించే విషయంలో కవిత చేసిన కృషి అనన్య సామాన్యం. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నేనున్నానంటూ వాలిపోయిన మహిళా నాయకురాలు కవిత. బలమైన గళం.. ఏ భాషలోనైనా అనర్గళంగా మాట్లాడగల నేర్పు.. మాటల తూటాలని పేల్చగల..  వారసత్వం వంటివి కవితను అనతి కాలంలోనే అందరి గుర్తింపును పొందేలా చేశాయి. సహజంగా రాజకీయంలో వారసత్వంగా వచ్చినవారు తండ్రిని కుటుంబ సభ్యులను అనుసరిస్తారు. కానీ కవిత విషయానికి వచ్చేసరికి తొలి రెండు సంవత్సరాలు ఎలా ఉన్నా 2007 సంవత్సరానికి వచ్చేసరికి తెలంగాణ జాగృతి పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించారు.


తద్వారా తెలంగాణ సంస్కృతి, కళ‌లు అదేవిధంగా మహిళలపై జరుగుతున్న దాడులు తెలంగాణ పై జరుగుతున్న సాహిత్య దాడులు వంటి వాటిని ప్రముఖంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కవిత పెద్ద పాత్ర పోషించారు. ఉద్యమ నాయకులతో కలిసి పాదయాత్రలు చేయటం, తెలంగాణ జాగృతి పేరుతో మహిళలను ఏకీకృతంగా నడిపించడం వంటివి తెలిసిందే. అప్పటి ప్రభుత్వాలపై అలుపెరగని పోరు సాగించడంలో కవిత ముందున్నారు. లాఠీలకు తూటాలకు తెలంగాణ తలవంచ‌ద‌ని` నిజామాబాద్ గడ్డపై ప్రకటించిన కవిత ఆనాడు పోలీసుల చేత అరెస్ట్ అయినప్పటికీ మరుసటిరోజే బలంగా బయటకు రాగలిగారు.


తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టడంలో.. తెలంగాణ జాగృతి ముందుంటుందని సమాజానికి చాటిచెప్పారు. ఈ క్రమంలోనే ఆధ్యాత్మిక పండుగ అయిన బతుకమ్మను తెలంగాణ ఉద్యమానికి ముడిపెట్టి తనదైన శైలిలో ముందుకు తీసుకువెళ్లారు. తెలంగాణలో ఒక మహోజ్వల ఘట్టం జరుగుతున్న సమయంలో దానికి ఆలంబ‌నగా  తెలంగాణలో జరిగిన సమాంతర సమరంలో కవిత పాత్ర మెచ్చుకోదగింది. తెలంగాణ సాధన తర్వాత 2014లో నిజామాబాద్ లోక‌సభ‌ నియోజకవర్గ నుంచి పార్లమెంటుకు తొలిసారి ఎన్నికయ్యారు.


పార్లమెంటులో కూడా ఏ సమస్య పైన అయినా ఆమె అనర్గళంగా ప్రస్తావించేవారు. విభజన సమస్యలపై మాట్లాడినప్పుడు పార్లమెంటులో మిగిలిన సభ్యులందరూ మౌనం వహించే పరిస్థితి వచ్చింది. అంటే ఆమె వాగ్దాటి సూటి మాట ఎలా ఉండేవి అనేది అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు ఎవరు కష్టంలో ఉన్నా మేము ఉన్నాము అంటూ పార్లమెంటు వేదికగా ప్రకటించిన తీరు అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. రాజకీయంగా తండ్రి వారసత్వాన్ని అందుకుని రాజకీయాల్లోకి అడుగుపెట్టినా తనకంటూ ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు కవిత.


అటు పార్లమెంట్ లోను ఇటు రాష్ట్ర సమస్యల పై కూడా అనేక సందర్భాల్లో వెలుగెత్తి గళం వినిపించారు. తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో ఆమె స్వల్ప ఓట్లు తేడాతో ఓడిపోయారు. అయితే 2020లో తిరిగి శాసనమండలికి ఎన్నికయ్యారు. ఎక్కడ ఉన్నా ఏ పదవిని స్వీకరించిన కవిత తన దైన శైలితో తెలంగాణ వాదాన్ని వినిపించడంలో ముందున్నారని చెప్పాలి. ఎదుటి ప్రత్యర్థిని బలమైన మాటలతో ఎదుర్కోవ డంలో కవితకు కవితే సాటి. ప్రస్తుతం ఆమె ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో చిక్కుకొని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మొక్కవోని ధైర్యంతో ఉండటం.. అసలు సిసలు రాజకీయ నాయకత్వానికి నిదర్శనంగా తెలంగాణ సమాజం భావిస్తుండడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: