చంద్రబాబు క్యాబినెట్లో మొత్తం 25 మంది మంత్రులకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు కాకుండా 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో తెలుగుదేశం పార్టీ నుంచి 20 మంది మంత్రులు భారతీయ జనతా పార్టీ నుంచి సత్య కుమార్ యాదవ్ మంత్రిగా ఉండగా.. జనసేన నుంచి ముగ్గురికి అవకాశం దొరికింది. జనసేన నుంచి డిప్యూటీ సీఎంగా, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో మంత్రిగా, కందుల దుర్గేష్ అలాగే నాదెండ్ల మనోహర్ కూడా మంత్రి పదవులు దక్కించుకున్నారు. స్పీకర్గా బీసీ వర్గానికి చెందిన కొప్పులవెలమ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడును కూటమి ప్రభుత్వం ఎంపిక చేసింది.


అగ్రవర్ణాలకు సంబంధించి వర్గానికి నాలుగు మంత్రి పదవులు.. కాపు సామాజిక వర్గానికి నాలుగు మంత్రి పదవులు.. రెడ్డి సామాజిక వర్గానికి మూడు మంత్రి పదవులు దక్కాయి. ఎస్సీ ల నుంచి ఇద్దరు మంత్రులు అయ్యారు. ఇక ఖాళీగా ఉన్న క్యాబినెట్ బెర్త్‌ను రాయలసీమలో బలంగా ఉన్న బోయ వాల్మీకి సామాజికవర్గానికి ఇస్తారని.. ఆ సామాజిక వర్గం ప్రజాప్రతినిధులు ఆశలు పెట్టుకున్నారు. ఈ ఎన్నికలలో ఆ సామాజిక వర్గానికి చంద్రబాబు బాగా ప్రయారిటీ ఇచ్చారు. అనంతపురం - కర్నూలు రెండు పార్లమెంటు స్థానాలను టీడీపీ బోయ సామాజిక వర్గానికి ఇవ్వగా.. వారిద్దరు విజయం సాధించారు.


అలాగే గుంతకల్లు నుంచి మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం, రాయదుర్గం నుంచి మరో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు కూడా విజయం సాధించారు. వీరిద్దరిది కూడా బోయ సామాజికవ‌ర్గమే.. మంత్రాలయం నుంచి బోయ సామాజికవర్గానికి చెందిన నేతకు అవకాశం ఇవ్వగా.. అక్కడ ఆయన ఓడిపోయారు. బోయ సామాజిక‌వ‌ర్గం నుంచి చంద్రబాబు ఒకరికి క్యాబినెట్ అవకాశం ఇవ్వాలని అనుకుంటే.. మరి ఎన్నికలకు ముందు పార్టీ మారి వైసీపీ నుంచి వచ్చిన గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు అవకాశం ఇస్తారా..? లేదా గతం నుంచి టీడీపీలోనే కొనసాగిన మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులకు అవకాశం ఇస్తారా..? లేదా ఈ సామాజిక వర్గానికి రాయలసీమలో రెండు ఎంపీ సీట్లు ఇచ్చినందున అసలు క్యాబినెట్ బెర్త్‌ ఇస్తారా..? ఇవ్వరా..? అన్నది కూడా సస్పెన్స్ గా కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: