ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ చివర్లో అత్యంత ప్రభావం చూపించి.. జగన్ కు శాపంగా మారింది మాత్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా మంది అభిప్రాయం. ఆ సమయంలో తాను అధికారంలోకి వస్తే ఈ యాక్ట్ ను రద్దు చేస్తామని చంద్రబాబు చెప్పి.. దీనికి సంబంధించిన పాసు బుక్కులను బహిరంగంగా చింపేశారు.


దీంతో తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఇటీవల ఏపీ కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. ఇదే సమయంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ చట్టంపై ప్రజలు కూడా భయభ్రాంతులకు గురి అయ్యారు కాబట్టి దీనిని రద్దు చేయడంలో తప్పు లేదు. మరి దీనికి పరిష్కార మార్గం ఏంటి అనేది ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న.


వాస్తవానికి భూములు సర్వే నిర్వహించి వాటికి హద్దు రాళ్లు పాటించి.. ఆ తర్వాత ఆన్ లైన్ చేసి చాలా రోజులు అవుతుంది. ఎప్పటి లెక్కలనో ఇప్పటికి మన వాళ్లు ఫాలో అవుతున్నారు. దీంతో వాస్తవంగా ఉండే భూమికి కాగితాల్లో ఉండే లెక్కలకి పొంతన ఉండటం లేదు. దీంతో భూ తగాదాలు నిత్యకృత్యం అవుతున్నాయి.


దీంతో భూమి అమ్మే వారికి, కొనే వారికి ఒక నమ్మకం కల్పించేలా గత వైసీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. పక్కాగా సర్వే చేసి.. స్పష్టంగా హద్దులు చూపిస్తూ క్లియర్ టైటిల్ తో ఆ భూమికి ప్రభుత్వమే గ్యారంటీ ఇవ్వడం అనేది వైసీపీ విధానం. కానీ ఈ విధానంపై ప్రజల్లో అనేక అనుమానాలు రేకెత్తాయి. దీంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అయింది. మరి దీనికి ప్రత్యామ్నాయంగా ఏం తీసుకువస్తారు అనేది మాత్రం చంద్రబాబు చెప్పడం లేదు. మరి ఈ భూ సమస్యలను ఎలా పరిష్కరిస్తారు. వీటిపై సమాధానం, మార్గం చూపాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: