కృష్ణా తీరంలో కొత్త కరవు వచ్చి పడింది. గోదావరి నీళ్లు వచ్చాయని సంబురపడాలో.. లేక కృష్ణా నీళ్లు తగ్గాయని బాధ పడాలో అర్థం కానీ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. ఆల్మట్టికి వరదలు రావడంతో ఆ ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. దీంతో సాగర్ లో కొద్దిగా నీళ్లు వచ్చాయి. ఇప్పుడు వాటినే తాగు నీటి అవసరాల కోసం విడుదల చేస్తున్నారు. మళ్లీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఈ ఏడాది పరిస్థితులు దారుణంగా తయారు అయ్యాయి. సాగు సంగతి  పక్కన పెడితే.. తాగునీటి అవసరాల కోసం కూడా వర్షాలపైనే ఆధారపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.


తెలుగు రాష్ట్రాల్లోని రెండు ఉమ్మడి జలాశయాల్లో కలిపి ప్రస్తుతం కేవలం 9.914 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇవి కూడా కేవలం తాగు నీటి అవసరాలు తీర్చుకునేందుకు మాత్రమే  సరిపోతాయని  కృష్ణా బోర్డు తేల్చి చెప్పింది. శ్రీశైలంలో 803 అడుగుల నీటి మట్టానికి గానూ.. 5.705 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. నాగార్జున సాగర్ విషయానికొస్తే అట్టడుగున 500 అడుగుల నీటి మట్టం దగ్గర 4.780 టీఎంసీల నీరు ఉంది.  శ్రీశైలంలోని 5.705 టీఎంసీల నీటిని విద్యుత్తు ఉత్పత్తికి రెండు రాష్ట్రాలు వినియోగించుకొని దిగువకు వదలాలని నిర్ణయించుకున్నాయి. ఆ నీటిలో 5.134 టీఎంసీలు సాగర్ కు చేరతాయి అని అంచనా వేశారు.


మళ్లీ ఈ నీటిలోనే ఏపీ 4.5 టీఎంసీలు, తెలంగాణ 5.14 టీఎంసీలను వినియోగించుకోవాలి. అత్యవసరం అయితే తప్ప నీటిని వాడుకోకుండా పర్యవేక్షణ ఉండాలని బోర్డు అధికారులు తేల్చి చెప్పారు. శ్రీశైలం ఉమ్మడి జలాశయానికి నీటి ప్రవాహం రావాలంటే ఆల్మట్టి నుంచి దిగువకు రావాలి. తుంగభద్ర నుంచి ప్రవాహం వచ్చినా శ్రీశైలం చేరతాయి. ప్రస్తుతం ఆల్మట్టి జలాశయం 99.317 టీఎంసీలతో 80 శాతం నిండింది. ఆల్మట్టి పూర్తి స్థాయి నీటి నిల్వ 213 టీఎంసీలు. ప్రస్తుతం ఆ జలాశయానికి వచ్చే నీటి ప్రవాహం తగ్గుతోంది. మొత్తంగా చూసుకుంటే కృష్ణ మీద ఆధారపడే పరిస్థితులు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: