ఈ సీజన్ లో పసుపు ధర గరిష్టంగా రూ.18300 కి చేరింది. దీంతో రైతులు మళ్లీ పసుపు సాగుపై దృష్టి సారించారు. దీంతో కొత్త సీజన్ కోసం దేశ వ్యాప్తంగా సాగు విస్తీర్ణం మూడు రెట్లు పెరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో పసుపు సాగవుతుంది. ఒకప్పుడు పసుపునకు మంచి ధర రావాలంటే మహారాష్ట్రలోని సాంగ్లీకి వెళ్లేవారు.
ఇప్పుడు అదే మహారాష్ట్రలోని నాందేడ్, బస్మత్, హింగోళి లాంటి పెద్ద మార్కెట్లు ఏర్పడటంతో రైతులకు మరింత సౌలభ్యం ఏర్పడింది. ఇలా మార్కెట్ సౌకర్యం, ఎగుమతుల డిమాండ్లతో పసుపునకు మళ్లీ పూర్వ వైభవం వచ్చినట్లయింది. మహారాష్ట్ర, తెలంగాణ, తర్వాత ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక అసోంలో పసుపు సాగు అవుతోంది. తెలంగాణలో ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ లో పసుపు ఎక్కువగా సాగు అవుతుంది.
ఏడాదికి ఒక సీజనే ఈ పంట సాగు అవుతుంది. జూన్, జులై నెలలో సీజన్ ఆరంభం అవుతుంది. జనవరి, ఫిబ్రవరి నాటికి దిగుబడి వస్తుంది. నాలుగు నెలల వరకు రైతులు మార్కెటింగ్ చేసుకుంటారు. ఆ మధ్య కాలంలో రైతులు మక్కలు లాంటి పంటలు వేసుకుంటారు. అయితే ఈసారి మూడితల పెరిగిన సాగుతో తాజాగా వచ్చిన రేటే దక్కుతుందా.. లేక పడిపోతుందో తెలియదు కానీ.. రైతులు మాత్రం సాగుపై భారీ ఆశలైతే పెట్టుకున్నారు.