జగన్ పాలన ముగిసి రెండు నెలలు కావొస్తున్నా కొందరి అధికారుల్లో మార్పులు రావడం లేదు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లు ఏపీలోని అధికారులు పని నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది.  గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు, అవినీతి, అక్రమాలపై అసెంబ్లీలో చర్చిస్తున్నారు.


అయితే అధికారుల తీరు మీద కూడా రాష్ట్ర అసెంబ్లీ లాబీల్లో చర్చ జరిగింది. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాచారం ఇవ్వాలని మంత్రులు వారికి సూచిస్తున్నారు.  అధికారులు ఇచ్చే అరకొర వివరాలు చూసి మంత్రులు అసంతృప్తికి గురవుతున్నారు. తమనే బోల్తా కొట్టేంచేలా ఉద్యోగుల వ్యవహార శైలి ఉందంటూ పలువురు మంత్రులు అభిప్రాయపడుతున్నారు.

శాసన సభ మూడోరోజు సమావేశాల్లో భాగంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సమయంలో అధికారులు సరైన సమాచారం అందించలేదు.  గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపు పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రశ్నకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వకుండా అవును .. కాదు ఉత్పన్నం కాదు అంటూ అధికారులు సమాధానం ఇవ్వడం ఏంటని అభ్యంతరం తెలిపారు. పొడిపొడిగా సమాధానాలు చెప్పాలనే నిబంధన ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు.


అనుబంధ పత్రాల్లో కాకుండా సభ్యులకు ఇచ్చే సమాధానంలోనే వివరాలు ఉంచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపుపై  వ్యవహారం కూడా తీవ్ర చర్చనీయాంశం అయింది. జగన్ ప్రభుత్వ హయాంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఎంత మాత్రం మళ్లించలేదని అధికారులు సమాచారం ఇచ్చారు. దీనిపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు మళ్లింపు విషయంలో తనకు పూర్తి సమాచారం అందలేదని ఆయన తెలిపారు. దీనిపై కూడా పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: