పోలవరం ఊపిరి పీల్చుకుందా..! పోలవరం ప్రాజెక్టుపై కమ్ముకున్న నీలి మబ్బులు తొలిగిపోయాయా? చిక్కుముడులు వీడాయా? ఇక ప్రాజెక్టు పనుల్లో వేగం పెరగనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొన్నేళ్లుగా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ.. పోలవరం ప్రాజెక్టులో పురోగతి సాధించలేకపోతుంది. ఏపీ, తెలంగాణ విభజన తర్వాత ఈ ప్రాజెక్టుపై అనుమానాలు మరింత ముసురుకున్నాయి. పనులు నత్తనడకన సాగాయి. అదే సమయంలో ప్రాజెక్టు అంచనాలు పెరిగిపోయాయి.


ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత వైసీపీ సర్కారు ఇది ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం అని చేతులెత్తేసింది. కానీ ఇప్పుడు మూడేళ్లలో దీనిని పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షను వ్యక్తం చేశారు. కొత్త డయా ఫ్రం వాల్ నిర్మాణానికి  రెండు సీజన్ల సమయం పడుతుంది. దీనికి సమాంతరంగా మిగిలిన పనులు చేపట్టి మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో పని చేస్తున్నామన్నారు.


ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం సకాలంలో పూర్తి చేయకపోగా.. నాశనం చేసిందని విమర్శించారు. దరిమిలా రూ.30 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపే నిమిత్తం సీఎం అత్యవసర మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేశారు. రూ.990 కోట్లతో కొత్త డయా ఫ్రం వాల్ నిర్మించాలని, ఇందుకు కేంద్రం సహకరించాలని తీర్మానం చేశారు.


ఇదే సమయంలో పోలవరం పూర్తి చేసే బాధ్యతను కేంద్రం తీసుకోవడంతో హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తి అయి ఉంటే.. 960 మెగా వాట్ల జల విద్యుత్ కేంద్రం ఉత్పత్తిలోకి వచ్చేది. అది అందుబాటులోకి రాకవపోవడం వల్లే చాలా ఎక్కువ ధరకు బయట నుంచి కరెంట్ కొనాల్సి వస్తోంది. పంటలకు నీరు అందుబాటులోకి రాలేదు. ఇవన్నీ లెక్క వేస్తే నష్టం రూ.30 వేల కోట్ల వరకు ఉంటోందని చంద్రబాబు అన్నారు. ప్రాజెక్టు తొలిదశలో 41.15 మీటర్ల కాంటూరు.. మలి దశలో 45.72 మీటర్ల కాంటూరులో నిర్మాణాలంటూ సందేహాలకు తావివ్వకుండా.. గరిష్ఠ నీటి నిల్వ 196.40 టీఎంసీల మేర ప్రాజెక్టు నిర్మాణం సాగాలని ఆ మేరకు కేంద్రం సహకరించాలని కోరదామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: