ఏపీలో శ్వేత పత్రాల వార్ నడుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఇది వరకే పలు శ్వేత పత్రాలు విడుదల చేశారు. వాటికి కౌంటర్ గా మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు ఆరోపణలను తిప్పికొట్టారు. తాజాగా మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా చంద్రబాబు శ్వేత పత్రంపై తన దైన శైలిలో సెటైర్లు వేశారు.

చంద్రబాబు విడుదల చేసింది శ్వేత పత్రాలు కాదని.. సాకు పత్రాలు అని ఎద్దేవా చేశారు. అంతే కాదు.. సూపర్ 6 అమలు ప్రారంభం కాకముందే తొలి ఓవర్ లోనే డకౌట్ అయిందని అన్నారు. రాష్ట్ర ఆదాయం రూ.2.40 లక్షల కోట్లు కాగా.. రాష్ట్రాన్ని నడపడానికే రూ.2.50 లక్షల కోట్లు అవుతుందని.. ఆ అవసరాల కోసమే ఏటా రూ.10 వేల కోట్లు అప్పు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. అలాంటప్పుడు ఏటా దాదాపు రూ.లక్షన్నర కోట్ల వ్యయమయ్యే పథకాలను చంద్రబాబు ఏ విధంగా ప్రకటించారని.. ఇప్పుడు వాటిని ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.


టీడీపీ పాలనలో స్థూల ఉత్పత్తి  4.47 కాగా..  తమ హయాంలో 4.82గా నమోదు అయిందని.. అంటే 0.4 శాతం ఎక్కువని వివరించారు. దేశ జీడీపీలో రాష్ట్ర జీడీపీ వాటా 2014-19 వరకు 2.98శాతం కాగా.. తమ హయాంలో అది 4 శాతమని గుర్తు చేశారు. అంటే వైసీపీ పాలనలో అది 1.1శాతం పెరిగిందని చెప్పారు.


రాష్ట్రంలో టీడీపీ పాలన చివరి ఏడాది 2018-19లో తలసరి ఆదాయం రూ.1,54,031 కాగా, ఆ పెరుగుదల 11.38శాతం అని చెప్పారు. అదే తమ పాలనలో చివరి ఏడాది 2023-24లో తలసరి ఆదాయం రూ.2,19,518 కాగా.. అది 13.98 శాతం పెరుగుదల అని వెల్లడించారు. దీంతో మన రాష్ట్రం 18వ స్థానం నుంచి 13వ స్థానానికి చేరిందని చెప్పారు. అంతేకాక సులభతర వాణిజ్యంలో వరుసగా రాష్ట్రం నంబర్ వన్ గా నిలిచిందని.. ఇది అభివృద్ధి కాక మరేమిటి అన్ని ప్రశ్నించారు.  అంతేకాక 2014-19లో అప్పులు 21శాతం పెరిగితే.. తమ హయాంలో ఆ పెరుగుదల 12శాతమే అని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: