ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నుంచి పోటీ చేసి మోహిత్ రెడ్డి ఓడిపోయారు. పులివర్తి నానిపై దాడి జరిగిన ఘటనలో ఈయనపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు అయింది. అదుపులోకి తీసుకున్న అనంతరం 41ఏ నోటీసులు ఇచ్చి విడిచి పెట్టారు.
అయితే ఈ అరెస్టుపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. విదేశాల్లో చదవిన తన కుమారుడిని వీధి పోరాటాలకు సిద్ధపడేలా చేస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై మండి పడ్డారు. తన కొడుకు వయసు 25 ఏళ్లు అని.. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించి ప్రజా జీవితంలోకి వచ్చారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని అక్రమ కేసులో అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
విదేశాల్లో చదివిన తన కుమారుడిని వీధి పోరాటాల బాట పట్టిస్తున్న చంద్రబాబుకి కృతజ్ఙతలు తెలిపారు. అయితే ఇక్కడ కొన్ని కీలక విషయాలను వైసీపీ, టీడీపీ నేతలు మర్చిపోతున్నారు. ఏపీలో ఇప్పటికి అయినా ప్రజా ప్రతినిధులు కూర్చొని మాట్లాడుకోపోతే.. లేదా ప్రతీకార రాజకీయాలకు స్వస్తి పలకకపోతే అందరూ దొంగలే అవుతారు. పలు కేసుల్లో నిందితులుగా మిగిలిపోతారు. కోర్టుల చుట్టూ వాయిదాల కోసం తిరుగతూ ఉండిపోతారు.
ఇది ఒక పార్టీ నేతలకే పరిమితం కాదు. ఏపీలోని అన్ని పార్టీల నాయకులకు వర్తిస్తుంది. పరిటాల శ్రీరామ్, కారుమూరి సునీల్, మోహిత్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడితో పాటు పలువురు నాయకుల కుమారుల్లో మంచి విద్యావంతులున్నారు. వీరంతా నీచ రాజకీయాలుకు బలవుతున్నారు. ఒక్కసారి ఆలోచించి.. ప్రతీకార రాజకీయాలకు స్వస్తి పలకాలి.