భాగ్యనగరం బోన మెత్తింది. నగర వ్యాప్తంగా బోనాల సందడి నెలకొంది. గల్లీ గల్లీలో బోనాల శోభ సంతరించుకుంది.  రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా.. తమ కుటుంబాన్ని ఆశీర్వదించాలని అమ్మకి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ పాతబస్తీలో కూడా ఉత్సవాలు వైభవంగా సాగాయి.  జాతర  సందర్భంగా పాత బస్తీ చార్మినార్ ప్రాంతంలో కొలువైన భాగ్యలక్ష్మి అమ్మవారిని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దర్శించుకొని పోతరాజులా అగ్రహోదగ్ధులయ్యారు.


ఈ సందర్భంగా ఏర్పాటు  చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్బరుద్దీన్ తన బలమేంటో తెలియకుండా మాట్లాడుతున్నారని అన్నారు.. అక్బరుద్దీన్ సీఎం రేవంత్ రెడ్డి కలిసి బోనాల పండుగపై కుట్రలు చేస్తున్నారని మండి పడ్డారు. తాము అధికారంలోకి వస్తే భాగ్యలక్ష్మి ఆలయాన్ని కాశీ, అయోధ్య తరహాలో డెవలప్ చేస్తామని, బంగారు ఆలయంగా మారుస్తామని చెప్పారు.


అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్య నగరంగా మారుస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఏమో పాతబస్తీ ఆలయాన్ని కాశీ, అయోధ్య తరహాలో అభివృద్ధి చేస్తామని చెబుతోంది. ఇలా డెవలప్ చేయడానికి పాతబస్తీ ఏమైనా ఆధ్యాత్మిక క్షేత్రమా.. లేక చరిత్రకు నిలయమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. భాగ్య లక్ష్మి అమ్మవారు ఉన్నది వాస్తవమే అయినా.. కాశీ,అయోధ్యకు ఉన్న చరిత్ర పాత బస్తీకి లేదని గుర్తు చేస్తున్నారు.


ఒకవేళ వారు అధికారంలోకి  వస్తే పాతబస్తీని అభివృద్ధి చేయవచ్చు.. లేక కొత్త నగరంగా తీర్చి దిద్దవచ్చు. పాతబస్తీలో యముడి దగ్గర ఉండే చిత్త గుప్తుడు గుడి ఉంది. బహుశా ఇది భారత దేశంలో ఎక్కడా లేదు. ఒకవేళ అయోధ్య, కాశీలాగా అభివృధ్ధి చేయాలనుకుంటే తిరుపతిని చేయవచ్చు. బిహార్లో విష్ణుపథ్ కారిడార్ ను నిర్మించేందుకు కేంద్రం ప్రత్యేక నిధులు వెచ్చించింది. అదేదో తిరుపతిలో కేటాయిస్తే బాగుంటుంది. లేక తెలంగాణలో చూసుకుంటే రాముడు నడియాడిన భద్రాచలం కూడా ఉంది. దీనిపై దృష్టి సారించవచ్చు. కానీ బడ్జెట్ లో రూపాయి కూడా కేటాయించలేదు. అందువల్ల ఇవి కేవలం రాజకీయపరమైన మాటలే అని కొందరు విశ్లేషకులు కొట్టి పారేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: