గతంలో ఎప్పుడూ పాత పద్ధతిలో మాట్లాడే ఆయన ఈ సారి తన పంథా మార్చారు. కేంద్రంపై నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకే గురి పెడుతున్నారు. దీర్ఘకాలిక ఉపన్యాసాలు ఇస్తూ.. ఇండియా కూటమి నేతల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఈ సమయంలో కులం కలకలం సృష్టించింది. బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లోక్ సభలో బడ్జెట్ పై జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి సంచనల వ్యాఖ్యలు చేశారు.
గతంలో రాజ్యాంగం పట్టుకొని తిరగడం కాదు. దానిని ఓ సారి చదవాలి. అసలు రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉంటాయో తెలుసా అని రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చారు అనురాగ్ ఠాకూర్. తాజాగా కుల గణన గురించి మాట్లాడిన రాహుల్ గాంధీని ఉద్దేశించి.. తమది ఏ కులమో కూడా తెలియని వారు కూడా కుల గణన కోరుతున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీంతో ఇవి రాజకీయంగా పెను దుమారమే రేపుతున్నాయి. దీనిపై ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు ఆందోళన చేపట్టారు. అనురాగ్ ఠాకూర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే అందుకు ఆయన అంగీకరించలేదు. అనురాగ్ ప్రసంగాన్ని మోదీ తన ఖాతాలో పోస్టు చేశారు. కాంగ్రెస్ దేశాన్ని కుల గణన పేరుతో విభజించాలని చూస్తోందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. దేశాన్ని ప్రజాస్వామ్య, ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ఆ పార్టీ కుట్ర పన్నిందని ఆరోపించారు. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందుకు స్పీకర్ అనుమతి కోరారు. ఈ కులం అంశం రాజకీయంగా ఇంకా ఎంత దుమారం రేపుతుందో చూడాలి.