ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి దేశ రాజకీయాల్లోనే సరికొత్త సంచలనం సృష్టించింది. పార్టీ ఆవిర్భవించి సుదీర్ఘకాలం అవుతున్నా.. సరైన విజయం దక్కలేదు. 2019లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ ఓడిపోవడంతో ఇంటా బయటా అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా పట్టు విడవకుండా పార్టీని నిర్మాణాత్మకంగా నడిపి అధికారంలోకి తీసుకురాగలిగారు పవన్.


అయితే ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాని పవన్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండి ప్రజల నుంచి అర్జీలు, పార్టీ శ్రేణుల నుంచి అభ్యర్థనలు స్వీకరించనున్నారు. నెలలో కనీసం రెండు రోజుల పాటు పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాల్సిందేనని జనసేనాని ఆదేశాలు జారీ చేశారు.


అదే  సమయంలో ప్రజల నుంచి వచ్చిన వినతులకు పరిష్కార మార్గాన్ని కూడా చూపాలన్నారు. అయితే పవన్ చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కడప జిల్లా వేముల మండలానికి చెందిన బేరి దేవ భూషన్ అనే వ్యక్తి తాను కొనుగోలు చేసిన ఇంటి నుంచి తనను బలవంతంగా బయటకు గెంటి వేశారని.. కోర్టు ఆదేశాలను సైతం పాటించకుండా పార్థసారధి రెడ్డి అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలియజేశారు. న్యాయం తనవైపే ఉన్నా పోలీసులు సహకారం అందడం లేదని బాధితుడు వాపోయాడు.


ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే నానాజీ సమస్యను కడప ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన కూడా సానకూలంగా స్పందించారు. యమలనూరు గ్రామానికి చెందిన జగనన్న కాలనీ లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సచివాలయ ఉద్యోగి సూచించిన ప్రైవేట్ కాంట్రాక్టర్ కి డబ్బు కట్టి మోసపోయామని తెలియజేశారు. దీంతో పాటు చాలా మంది క్యూలైన్లో వేచి ఉండి మరీ తమ అర్జీలు అందజేస్తున్నారు. వీటికి వెంటనే అక్కడి దరఖాస్లులు స్వీకరించే నాయకులు తక్షణ పరిష్కార మార్గాలు చూపుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: