వైఎస్ జగన్ పాలనలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన ఇంటింటికీ రేషన్ పథకం చంద్రబాబు ప్రభుత్వానికి తల నొప్పిగా మారింది. అప్పట్లో రేషన్ డీలర్ల నుంచి ఈ పథకానికి వ్యతిరేకత వ్యక్తం అయింది. ఈ పథకం కోసం జగన్ .. ఏకంగా రూ. 1844 కోట్లను వెచ్చించి.. తొమ్మిది వేలకు పైగా వాహనాలను కొనుగోలు చేశారు. వీటిల్లో వార్డులకు సంబంధించిన రేషన్ సరకులను అన్నీ తీసుకెళ్లి వీధి చివరన ఆపేవారు.


వార్డు ప్రజలంతా ఆ వాహనాల వద్దకు వెళ్లి వేలి ముద్ర వేసి తమ రేషన్ సరకులు తీసుకెళ్లేవారు. అయితే చాలా మంది ఇంతోటి దానికి ఇంటింటికీ రేషన్ అనే పేరు ఎందుకు అని పెదవి విరిచిన వారు ఉన్నారు. అదే సమయంలో పారదర్శకంగా పని జరిగిందని అభినందించే వారు ఉన్నారు. అయితే మారుమూల గిరిజన ప్రాంతాలు, రాకపోకలు సవ్యంగా లేని గ్రామాలప్రజలకు ఈ పథకం సౌకర్యవంతంగా ఉండేది.


అయితే టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఈ వాహనాలను వినియోగించడం లేదు.   పాత పద్దతిలోనే బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. తాజాగా దీనిపై సమీక్ష నిర్వహించిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రేషన్ బియ్యం సరఫరా చేసే వాహనాలతో ఎటువంటి ప్రయోజనం లేదని తేల్చి చెప్పారు. ఎండీయూ వాహనాల వల్ల నష్టం తప్ప లాభం లేదని ఆయన పేర్కొన్నారు.


ఎండీయూ వాహనాలకు ఇంకా చెల్లింపులు జరపాల్సి ఉందని.. దీంతో పాటు డోర్ డెలివరీ విధానం లోప భూయిష్టం గా ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఈ వాహనాల ద్వారా రేషన్ డోర్ డెలివరీ జరగలేదన్నారు. ఈ సందర్బంగా వీటిని బియ్యం స్మగ్లింగ్ కి వాడుకున్నారని ఆరోపించారు. మొత్తానికి వాహనాల ద్వారా పంపిణీకి ఏపీ ప్రభుత్వం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా..  పాత పద్ధతిలోనే బియ్యాన్ని ఇవ్వనున్నారని మంత్రి వ్యాఖ్యలతో అర్థం అవుతుంది. మరి దీనిపై ప్రజలు ఏం అంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: