ఏపీలోని డీఆర్డీవో ప్రాజెక్టు గుజరాత్ కి ఎగిరిపోనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.  గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రైవేట్ పరిశ్రమలే కాదు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు ఏపీ నుంచి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం కొరవడిన కారణంగా కృష్ణా జిల్లా జిల్లా దివిసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ క్షిపణి పరీక్షా కేంద్రాన్ని గుజరాత్ కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.


ప్రస్తుతం క్షిపణి పరీక్ష కేంద్రంగా ఉన్న ఒడిశాలోని బాలోసోర్ కంటే.. అనువైన ప్రాంతం కోసం అన్వేషించిన కేంద్ర రక్షణ శాఖ.. 2011లో కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలోని గుల్లలమోద గ్రామాన్ని ఎంపిక చేసింది. ఇక్కడ 386 ఎకరాలు కావాలని డీఆర్డీవో 2012లో ప్రతిపాదించగా.. అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదు. 2014 లో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు కేంద్రంతో చర్చించారు.


2017లో ఏటిమొగ రెవెన్యూ గ్రామ పరిధిలో అభయారణ్యంలో 381.16 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం డీఆర్డీవోకి కేటాయించింది. దీనికి బదులుగా గణపేశ్వరం పరిధిలోని అంతే రెవెన్యూ భూమిని అటవీ శాఖకు కేటాయిస్తూ.. జీవో 1352 ఇచ్చింది. 2017 లోనే కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి తొలి దశ అనుమతులు వచ్చాయి. 2018లో సీఆర్ జడ్ నుంచి కూడా మినహాయింపు తీసుకున్నారు.


2019లో పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి రెండో దశ అనుమతులు పొందగా.. 2020-1లో ఆ స్థలాన్ని డీఆర్డీవో స్వాధీనం చేసుకొని ప్రహరీ నిర్మించింది. తర్వాత ఎలాంటి పురోగతి లేదు. క్షిపణి కేంద్రానికి వచ్చే ప్రముఖులకు అతిథి, వసతి గృహ సముదాయం కోసం స్థలం కావాలని డీఆర్డీవో ప్రభుత్వానికి లేఖ రాయగా.. నాటి సీఎం జగన్ పట్టించుకోలేదు. అయితే తొలి దశలో సుమారు రూ.1800 కోట్లు వెచ్చించాలని కేంద్రం ప్రణాళికలు వేసింది. ఐదేళ్లుగా జగన్ సర్కారు స్పందించని కారణంగా ఈ కేంద్రాన్ని గుజరాత్ కి తరలించాలనే యోచనలో డీఆర్డీవో ఉన్నట్లు తెలిసింది. మరి దీనిని చంద్రబాబు, పవన్ లు ఎలా ఆపుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: