ఏపీలో కూటమి ప్రభుత్వంపై తన ముద్ర పడేలా చూసుకోవాలన్నది చంద్రబాబు ఆలోచన. ఇది మంచిదే. ప్రత్యేకంగా ఈ అయిదేళ్ల పాలనపై ఆయన ముద్ర పడాల్సిందే.  ఎందుకంటే చంద్రబాబు బ్రాండ్ ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. అభివృద్ధి పథంలో నడుస్తుంది. విజన్ 2047 వంటి ప్రత్యేక కార్యక్రమాలు వెలుగులోకి వస్తాయి. కాబట్టే ఆయన ముద్రను అందరూ కోరుకుంటారు.


అయితే ఇక్కడ సమస్య ఏంటంటే.. చంద్రబాబు బ్రాండ్ లేదా తనదైన పాలన సంస్కరణల పేరుతో కొన్ని పథకాలను తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఇబ్బందికరంగా మారింది. ఏ ప్రభుత్వం వచ్చినా పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. కానీ ఒక్కో సారి ఆయా ప్రభుత్వాలు వేసే అడుగులు కొంత వ్యతిరేకతను పెంచుతాయి. ఇలాంటి పరిణామాలు వైసీపీ హయాంలో మనకి స్పష్టంగా కనిపించాయి.


ఉదాహరణ తీసుకుంటే అన్న క్యాంటీన్ 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందే ప్రారంభించినా ప్రజలకు బాగా చేరువ అయింది. ముఖ్యంగా రిక్షా కార్మికులు, ఆటో వాలాలు, ఉద్యోగులు , యాచకులు ఇలా అనేక మంది ఐదు రూపాయలకే భోజనం చేశారు. దీంతో వారి కడుపు నిండి మేలు జరిగింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని తీసేసింది. ప్రత్యామ్నాయంగా మరే పథకాన్ని ప్రవేశ పెట్టలేదు కూడా.


ఇది ప్రజల్లో ముఖ్యంగా ఆయా వర్గాల్లో వైసీపీపై వ్యతిరేక భావనను పెంచేలా చేసింది. ఇలా ప్రజలతో ముడిపడిన కొన్ని పథకాలు తీసేయడం అనేది కొంత ఇబ్బందికర పరిణామం. అది జగన్ కి అయినా.. చంద్రబాబుకి అయినా ఇది ఇద్దరికీ వర్తించే సూత్రం. అయితే చంద్రబాబు ఇప్పుడు చాలా పథకాలకు పేర్లు మారుస్తున్నారు. సచివాలయ వ్యవస్థ దగ్గర నుంచి అన్ని వ్యవస్థలకు జగన్, వైఎస్సార్ పేర్లు లేకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా తన దైన మార్క్ ఉండేలా చంద్రబాబు చూసుకుంటున్నారు. అందుకే అన్నింటా కాకపోయినా.. కొన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తే మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: