నదుల అనుసంధాన ప్రక్రియ మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్రంలో మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన ప్రధాని మోదీ గోదావరి-కావేరీ నదుల అనుసంధానంపై దృష్టి సారించారు. ఈ నదుల అనుసంధాన విధానం చాలా గొప్ప నిర్ణయమని విశ్లేషకులు అంటున్నారు. వరదలు ఎక్కువ అయి నీరంతా వృథాగా సముద్రంలో కలవకుండా వాటిని కాపాడుతూ..  తక్కువ నీరున్న నదుల్లోకి డైవర్ట్ చేసి వాటిని వినియోగించడం.


అయితే కావేరీ-గోదావరి నదుల అనుసంధానంపై చంద్రబాబు కూడా తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. రాష్ట్రానికి మేలు చేసేలా.. మరీ ముఖ్యంగా రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లా బొల్లాపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మిస్తోంది. అక్కడ నుంచి అవకు, సోమశళ ఫోర్ షోర్ మీదుగా కండలేరుకు  గోదావరి జలాలను తరలిస్తారు.


అంతిమంగా చెన్నై కు మూడు విడతల్లో 50 టీఎంసీల జలాలు పోలవరం ప్రాజెక్టు ఎగువున ఉన్న చింతలపూడి ఎత్తిపోతల పథకానికి పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా 320 టీఎంసీల గోదావరి జలాలను తరలిస్తారు. ఈ జలాలను గుంటూరు జిల్లా బొల్లాపల్లి వద్ద నిల్వ చేసేలా ఒక రిజర్వాయర్ను నిర్మిస్తారు. నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీళ్లిస్తూనే.. వెలిగొండ రిజర్వాయర్ కు జలాలు చేర్చి అక్కడ నీటి అవసరాలు తీరుస్తారు.


ఆపై పెన్నా నదికి నీరు చేరుతుంది. సోమశిల ప్రాజెక్టు ద్వారా తెలుగు గంగకు, గాలేరు నగరి, హంద్రీనీవా సుజల స్రవంతి లోకి గోదావరి జలాలను తరలిస్తారు. అక్కడి నుంచి అంతిమంగా కావేరీకి గోదావరి జలాలు చేరతాయి. సంక్లిష్టమైన నదుల అనుసంధానాన్ని సులువుగా పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. గతంలో ఇచ్చింపల్లి నుంచి కావేరీ దాకా నదుల అనుసంధాన ప్రక్రియకు వేసిన అంచనా వ్యయం రూ.95 వేల కోట్లు. ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన అనుసంధాన ప్రక్రియను రూ25 వేల కోట్లలో పూర్తి చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: