వ్యవసాయ ఆధారిత భారత దేశంలో అనాదిగా పంటల సాగు అస్థిరంగా, వర్షాధారంగా సాగుతోంది. పెరుగుతున్న జనాభా, ఆహార, తాగు నీటి అవసరాల దృష్ట్యా నీటిని ఒడిసిపట్టడం అనివార్యం అయింది.  ఇందులో భాగంగానే ఆయా రాష్ట్రాల్లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మించింది. అయితే ఈ ప్రాజెక్టుల్లో కొన్ని నదుల ద్వారా మాత్రమే నీరు వచ్చి చేరుతోంది.


ఇవి నిండి పొంగి పోర్లితే ఆ నీరంతా సముద్రం పాలు అవుతోంది తప్ప నీరు లేని రాష్ట్రాలకు.. ఉపయోగం ఉండటం లేదు. దీనికి అడ్డుకట్ట వేయాలని భావించిన నరేంద్ర మోదీ సర్కారు నదుల అనుసంధానంపై దృష్టి సారించింది. ఈ పథకానికి అధిక  ప్రాధాన్యం ఇచ్చి చేపట్టాలని నిర్ణయించి కమిటీలు, అధిక నిధులు వెచ్చిస్తున్నా కాలయాపన జరుగుతూనే ఉంది తప్ప అడుగు ముందుకు పడటం లేదు.


అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నా.. నీటి లభ్యత విషయంలో రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. లభ్యమవుతున్న జలాలు తమ అవసరాలకే సరిపోవడం లేదని.. పైనుంచి తెచ్చి మళ్లిస్తే అభ్యంతరం ఉండదంటూ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చెబుతోంది. అంతే కానీ తమ రాష్ట్రంలోని నీటిని మాత్రం వదులుకునేందుకు సిద్ధంగా లేవు.


దేశం మొత్తం మీద 30 అనుసంధానాలు ఉంటే ఒడిశా, దక్షిణాది రాష్ట్రాల్లోనే తొమ్మిది అనుసంధానాలు ఉన్నాయి. ఒడిశాలోని మహా నది నుంచి నీటిని మళ్లించడం, అక్కడ నుంచి కృష్ణా-పెన్నా-కావేరీ అనుసంధానాలు వీటిలో ఉన్నాయి. అయితే ప్రస్తుత నీటి లభ్యత తమకే సరిపోతుందని అప్పటి నవీన్ ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీంతో పాటు దిగువకు నీటిని విడుదల చేస్తే ముంపు సమస్యలు ఉంటాయని ఆయా రాష్ట్రాలు పేర్కొంటున్నాయి. గోదావరి-కావేరీ అనుసంధానం చేయాలని కేంద్రం భావిస్తే దానిని తెలంగాణ అడ్డు తగులుతోంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఏ రాష్ట్రం కూడా తమకు హక్కుగా ఉన్న నీటిని వదులుకునేందుకు సిద్ధ పడదు. అలా చేస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.  మరి దీనిపై కేంద్రం ఎలా ముందుకెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: