వైసీపీలో నేతల వలసలు ప్రారంభంమయ్యాయి. కొందరు టీడీపీలోకి, మరికొందరు జనసేనలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కార్పొరేటర్ల స్థాయి నుంచి ఇప్పుడే వలసల పర్వం మొదలైంది. ఇక ఆగేట్లు లేదు. ఎందుకంటే ఇంకా ఐదేళ్లు అధికారంలో లేకుండా ఉండలేని పరిస్థితి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఇప్పటి వరకు వైసీపీ పాలనలోనే ఉన్నాయి.


అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సహజంగా ఎమ్మెల్యేలు తమ పట్టును నిలుపుకునేందుకు వలసలను ప్రోత్సహిస్తారు. పార్టీలో చేర్చుకుంటారు. వాళ్లకు కావాల్సింది అధికార పార్టీలో ఉండటం. ఎమ్మెల్యేలకు కావాల్సింది స్థానిక సంస్థల మీద పట్టు పెంచుకోవడం. దీంతో వైసీపీలో నేతలు మిగలరు అనేది స్పష్టంగా అర్థం అవుతుంది. ఇన్నాళ్లు నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్సీలు అంటూ ఎక్కువ పదవులను జగన్ వారికే కట్టబెట్టారు. ఇప్పుడు పార్టీ మారే వారిలో ఎక్కువ శాతం మంది వారే ఉన్నారు.


ఎమ్మెల్యేల ప్రభావమో.. లేక ఐదేళ్ల తర్వాత చూసుకుందాం అనే ధీమానో కావచ్చు వరుసగా నేతలు కూటమి పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రతి పక్షంలో ఉంటే తమకు నిధులు అందవు. ఇప్పటి వరకు చేసిన వాటికి బిల్లులు రావు. నామినేటెడ్ పనులు చేసుకునేందుకు వీలుండదు. అందుకీ అన్నీ దక్కాలంటే జెండా మార్చేయడమే బెటర్ అనే ఆలోచన అందరిలో మెదులుతుంది.


ఇది ఇలా ఉండగా.. పార్టీ అధినేత జగన్ వారితో మాట్లాడే ప్రయత్నం చేయడం లేదనే అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.  మున్సిపల్ ఛైర్మన్లు, ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించి వారిలో ఆత్మవిశ్వాసం నింపే పనిని జగన్ చేయడం లేదు. మొన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి.. వారితో మాట్లాడారు అని.. లేకుంటే అది కూడా ఉండదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవంగా జగన్ స్వభావం ఎలా ఉంటుందంటే.. పోయే వారిని ఆపరు. ఉండేవాళ్లను ఉండమని అంటారు. ఉన్నవారితోనే పార్టీ నడిపే తత్వం జగన్ ది అని విశ్లేషకులు అంటున్నారు. ఇలా వెళ్లిన వారే రేపు పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ తమ గూటికి చేరతారు అనేది ఆయన  ఆలోచనగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: