తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా.. కాంగ్రెస్ పార్టీకి పదేళ్లు అధికారం దక్కలేదు. ఎట్టకేలకు 2023 నవంబరు లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీకి తెలంగాణ చిక్కింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో ఉన్న ప్రజలు ఆ పార్టీని గద్దె దించి.. కాంగ్రెస్ కు పట్టం కట్టారు.
డిసెంబరులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. సీఎంగా రేవంత్.. 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. క్యాబినెట్ లో ఇంకా ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదే సమయంలో టీపీసీసీ అధ్యక్ష పదవి కూడా ఖాళీగానే ఉంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ సారథిని ఎంపిక చేయడంతో పాటు మిగిలిన మంత్రి పదవులు ఎవరికీ ఇవ్వాలనే దానిపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్ర కసరత్తులు చేస్తుంది. చివరకు ఈ కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది.
కొత్త పీసీసీ సారథి పదవిని బీసీలకు ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఆరు మంత్రి పదవుల్లో నాలుగు పదవులకు ఎమ్మెల్యేలను ఎంపిక చేసినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ తో చర్చలు జరిపారు. ఇక ఈవిషయమై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు కనిపిస్తోంది.
టీపీసీపీ రేసులో బలరాం నాయక్, అడ్లూరి లక్ష్మణ్ తో పాటు మహేశ్ కుమార్ గౌడ్, మధుయాస్కీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి మధ్యే పోటీ ప్రధానంగా ఉన్నట్లు వినిపిస్తోంది. దిల్లీలో జరిగిన చర్చల్లో మెజార్టీ నేతలు మహేశ్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన ఈ వారంలో వెలువడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో పాటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరేముందు వివేక్, రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన హామీలపైన కూడా ప్రధానంగా చర్చ జరిగింది. ఇక ఓబీసీల్లో బలమైన సామాజిక వర్గం అయిన ముదిరాజ్ నుంచి వాకాటి శ్రీహరికి మంత్రి పదవి ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి.