మంగళవారం వచ్చిందంటే చాలు ఏపీ ప్రభుత్వం అప్పులు చేసేందుకు సిద్ధమైంది. వాస్తవానికి రిజర్వ్ బ్యాంకు ప్రతి మంగళవారం అప్పులు తీసుకునేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా గత రెండు మంగళవారాలకు విరామం ఇచ్చిన ఏపీలోని కూటమి ప్రభుత్వం ఈ వారం మాత్రం మరో రూ.3వేల కోట్లు రుణం తీసుకునేందుకు సిద్ధమైంది.


వచ్చే మంగళవారం రూ.3 వేల కోట్లను చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు తీసుకోనుంది. 27న రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వం కోసం ఈ అప్పును సమీకరించనుంది. ఈ మేరకు సెక్యూరిటీల వివరాలను వెల్లడించింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం మంగళవారాల్లో రూ.12 వేల కోట్లను అప్పు చేసింది. వచ్చే మంగళవారం చేసే అప్పుతో కలిసి ఈ మొత్తం రూ.15 వేల కోట్లకు చేరుతుంది. 12 ఏళ్ల కాల వ్యవధితో రూ.1000 కోట్లు, 17 ఏళ్ల కాల వ్యవధితో రూ.1000 కోట్లు, 22 ఏళ్ల కాల వ్యవధితో మరో రూ.1000 కోట్లను వచ్చే మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయనుంది.


సీఏజీ ద్వారా విదేశీ ప్రాజెక్టుల రుణాలకు సంబంధించి తెలంగాణ నుంచి రావాల్సిన రూ.2500 కోట్లకు సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ సర్కారు పరిష్కారం కనుగొంది. అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి ఈ ఏడాది జనవరి నుంచి సీఏజీతో పలు మార్లు చర్చలు జరిపారు. ఉమ్మడి ఏపీలో విదేశీ ప్రాజెక్టుల రుణాలు చెల్లింపులన్నీ రాష్ట్ర విభజన అనంతరం ఏపీ ప్రభుత్వమే చేస్తూ వస్తోంది.


తెలంగాణ వాటా కూడా ఏపీ ప్రభుత్వమే చెల్లించింది. దీనికి సంబంధించి మనకి తెలంగాణ నుంచి రూ.2500 కోట్లు రావాల్సి ఉందని సీఏజీ గత జనవరిలో తేల్చింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడంతో తెలంగాణ నుంచి రావాల్సిన ఆ నిధుల విషయాన్ని కేంద్రం పట్టించుకోలేదు. ఇప్పుడు  రూ.2500 కోట్లను ఏపీ ప్రభుత్వానికి కేంద్రం సర్దుబాటు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp