దేశంలోనే తొలిసారిగా నైపుణ్య గణనను సెప్టెంబరు 3న ప్రయోగాత్మకంగా మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ కసరత్తు చేస్తోంది. దీంతో పాటు నాగార్జున విశ్వ విద్యాలయ విద్యార్థుల నుంచి సమాచారం సేకరించనున్నారు. సర్వేకు వినియోగించే యాప్ రూపకల్పన దాదాపు పూర్తి అయింది. ప్రతి ఒక్కరూ నేరుగా తమ వివరాలను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

 


సర్వే పూర్తైన తర్వాత వెబ్ సైట్ ను అందుబాటులో ఉంచితే మరింత మంది తమ వివరాలను నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. సమాచారం సేకరించిన విశ్లేషణ చేసేందుకు దాదాపు 8 నెలల సమయం పడుతుందని నైపుణ్యాభివృద్ధి సంస్థ అంచనా వేస్తోంది.


దీనిపై సమీక్ష నిర్వహించిన మంత్రి నారా లోకేశ్.. నైపుణ్య గణన సర్వే మొక్కుబడిగా కాకుండా అర్థవంతంగా చేపట్టాలని సూచించారు. స్కిల్ సెన్సస్ సర్ఏవ నిర్వహణపై స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో ఉండవల్లి నివాసంలో భేటీ అయ్యారు. స్కిల్ సెన్సస్ లో భాగంగా యువతకు చెందిన ఎడ్యుకేషన్, ఎంప్లాయ్ మెంట్, స్కిల్ ప్రొఫైల్స్ ను క్రోడీకరించి ప్రభుత్వమే ఒక ప్రత్యేక రెస్యూమ్ తయారు  చేస్తుందని వివరించారు.


ఈ ప్రొఫైల్స్ ని ప్రముఖ కంపెనీలకు నేరుగా యాక్సెస్ ఇస్తామని చెప్పారు.  తద్వారా ఆయా కంపెనీలకు అవసరం అయిన నైపుణ్యం ఉన్న యువతను నేరుగా ఎంపిక చేసుకునే విధానం అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ఎడ్యుకేషన్, స్కిల్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేయాలని సూచించారు. ఇదే సమయంలో యువత, ప్రజలకు అపోహలకు గురి చేయొద్దని అవసరమైన ప్రశ్నలను మాత్రమే అడగాలి అన్నారు.


స్కిల్ సెన్సస్ అంతిమ లక్ష్యం యువతకు ఉద్యోగ కల్పన మాత్రమేనని.. ఆ దిశగా నైపుణ్య గణన జరగాలని అన్నారు. పరిశ్రమలు అవసరమైన నైపుణ్య శిక్షణ, యువతకు ఉద్యోగాల కల్పన ఈ రెండు అంశాలే స్కిల్ సర్వే అంతిమ లక్ష్యం అని వివరించారు. పూర్తి స్థాయి ప్రణాళిక సిద్దమైన తర్వాత మంగళగిరిలో ఫైలెట్ ప్రాజెక్టు గా స్కిల్ సర్వేను చేపట్టాలని లోకేశ్ అధికారులను ఆదేశించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: