అసెంబ్లీ సమావేశాలు పూర్తి అయ్యాయి. ఆషాఢం అయిపోయింది. అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం కూడా ఖరారవుతోంది. మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. నామినేటేడ్ పోస్టులు ఒక్కోటిగా భర్తీ అవుతున్నాయి. ఇక మిగిలింది.. మధ్యలో ఆగిపోయింది ఏంటంటే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల ఆకర్షణ.


దీంతో బీఆర్ఎస్ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏ క్షణమైనా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ లాగేసుకుంటుందని గులాబీ నేతలు భయపడుతున్నారు.  ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనూహ్యంగా దిల్లీకి పయనం అయ్యారు. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.


తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు రుణమాఫీ హామీని నెరవేర్చలేదంటూ బీఆర్ఎస్ ఆందోళనలకు దిగుతోంది. మరోవైపు హైడ్రా కూల్చివేతలను ప్రశ్నిస్తోంది. పార్టీ నేతలనే టార్గెట్ చేయడం పట్ల విమర్శల వర్షం కురిపిస్తోంది. ఇంతటి బీజీ షెడ్యూల్ లో కేటీఆర్ భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో దిల్లీకి వెళ్తుండటం గమనార్హం.



కాగా.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాల్లో గెలిచింది. వీరిలో లాస్యప్రియ మరణం అనంతరం జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. సాంకేతికంగా బీఆర్ఎస్ కు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ వీరిలో 10 మంది కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. మిగిలిన 28 మందిలో 20 మందితో కేటీఆర్ దిల్లీకి వెళ్లడం వెనుక ఉద్దేశం ఏంటని చూడాలి. వీరేకాక ముఖ్యనేతలు పార్టీ ఎంపీలను తీసుకెళ్తున్నారు.


దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మంగళవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఈ సందర్భంగా కూడా కేటీఆర్ పర్యటన ఆసక్తి రేపుతోంది. ఈసారి కచ్చితంగా బెయిల్ వస్తుందనే గట్టి నమ్మకంతో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. అందుకే ఆమెను ఆహ్వానించేందుకు 20 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్తున్నారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే అంశాన్ని తెరపైకి తెచ్చే వారు ఉన్నారు. దీనిపై కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి కేటీఆర్ ఏం చేయబోతున్నారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: